భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల చారిత్రక పర్యటన నిమిత్తం న్యూజిలాండ్ చేరుకోనున్నారు. మూడు దేశాల (ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) పర్యటనలో భాగంగా చివరి విడతగా ఆయన ఆక్లాండ్ నగరానికి చేరుకుంటారు. గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. చివరిసారిగా 1986లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఇక్కడ పర్యటించారు. ఈ పర్యటన నేపథ్యంలో ఆక్లాండ్ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రక 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' అమలు, పెట్టుబడులు, రక్షణ రంగం, సముద్ర తీర భద్రత, విద్య, సాంకేతిక రంగాలలో పరస్పర సహకారంపై ఇరు దేశాల అధినేతలు కీలక చర్చలు జరపనున్నారు. ఈ ఒప్పందం ద్వారా న్యూజిలాండ్ నుంచి భారతదేశానికి ఎగుమతి అయ్యే 95 శాతం ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడంతో పాటు రాబోయే 15 ఏళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్‌కు రానున్నాయి.
రాజకీయ, వాణిజ్య చర్చలతో పాటు ప్రధాని మోదీ అక్కడ నివసిస్తున్న భారీ సంఖ్యలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆక్లాండ్‌లోని స్పార్క్ అరీనాలో నిర్వహించనున్న అత్యంత ప్రతిష్టాత్మక 'కియా ఓరా మోదీ' కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ భారీ బహిరంగ సభకు వేలాది మంది భారతీయులు తరలిరానున్నారు. దీంతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, క్రీడా రంగ ప్రముఖులతో కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.












