హైదరాబాద్‌ను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలను నిర్వహించే స్థాయికి నగరాన్ని తీసుకెళ్లాలనేది తన కలని పేర్కొన్నారు.
గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి సీఎం ప్రారంభించారు. అనంతరం యూనివర్సిటీ వెబ్‌సైట్, లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, పీటీ ఉష భారత క్రీడా రంగానికి ఆదర్శమని కొనియాడారు. ఆటలలోనే కాకుండా ప్రజా జీవితంలోనూ ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సమగ్ర క్రీడా విధానాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు.
1990 నుంచి 2004 వరకు హైదరాబాద్ అనేక జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇచ్చిందని, అయితే గత రెండు దశాబ్దాల్లో పెద్ద స్థాయి క్రీడా ఈవెంట్లు తగ్గిపోయాయని సీఎం గుర్తు చేశారు. ఆ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.
యువతలో క్రీడలపై ఆసక్తి పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం అన్నారు. క్రీడలను కెరీర్‌గా ఎంచుకున్న వారికి అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సరైన శిక్షణ, మౌలిక వసతులు, ప్రోత్సాహం కల్పిస్తే తెలంగాణ యువత ప్రపంచ స్థాయిలో ప్రతిభ చాటగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత్ ఒలింపిక్స్‌లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలంటే క్రీడలకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని సీఎం పేర్కొన్నారు. క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు కల్పించి, తెలంగాణను దేశంలోనే అగ్రగామి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.












