రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న ప్రజా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో అత్యాధునిక సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజకీయంగా ఎన్ని విమర్శలు, ఆరోపణలు ఎదురైనా.. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టడమే తమ సంకల్పమని తెలిపారు.
ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఉపాధి అవకాశాలను పెంచుతూ రాష్ట్రాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.. దేశంలోని అనేక మహానగరాలు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సీఎం గుర్తుచేశారు. ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, బెంగుళూరు, చెన్నై నగరాల్లో ట్రాఫిక్ పెద్ద సవాల్‌గా మారిందన్నారు.
అందుకే హైదరాబాద్ అభివృద్ధి భిన్నంగా ఉండాలని, కాలుష్య రహిత ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 2100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని CURE ఏరియాగా గుర్తించి, పూర్తిగా సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణను CURE, PURE, RARE ప్రాంతాలుగా విభజించి సమ్మిళిత అభివృద్ధి సాధించాలనే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రణాళికా బద్దంగా ప్రజా ప్రభుత్వం పాలన చేస్తుందని అన్నారు.. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చడమే తమ లక్ష్యమన్నారు. అయితే ఈ లక్ష్యాలు సాధించాలంటే మరిన్ని పెట్టుబడులు అవసరమని, పెట్టుబడులు రావాలంటే అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించాల్సిందేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
యువతే తెలంగాణ భవిష్యత్తని చెబుతూ, వారికి ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించేందుకు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లతో పాటు ప్రత్యేక స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యవంతులైన మానవ వనరులను తెలంగాణ నుంచే అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సీతారాంపూర్‌లో ప్రారంభమైన సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ రంగానికి కొత్త దిశ చూపుతుందని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమలు రావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని అన్నారు.
ఈ సందర్భంగా భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం మరచిపోదని సీఎం హామీ ఇచ్చారు. వారికి ఇంటి పట్టాలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాల కోసం వ్యాపార సముదాయాలు నిర్మించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా రైతులు చేసిన త్యాగాల వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందన్న రేవంత్ రెడ్డి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు 100 మీటర్ల వెడల్పుతో ఆధునిక రహదారి నిర్మాణం కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి బలమైన పునాది అవుతాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాజకీయాలకు సమయం కాదని, ఎన్నికల సమయంలో రాజకీయాలు చేసుకోవచ్చని సీఎం వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయిన బాధ కొందరికి ఉండవచ్చని, కానీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని సూచించారు. కొన్నాళ్లు ప్రభుత్వం పని చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.
ప్రజల సహకారంతో 2030 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. త్వరలోనే ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఆలయ ప్రారంభోత్సవానికి మరోసారి వస్తానని, ప్రజలందరినీ తిరిగి కలుస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.












