తెలంగాణ

గ్రీన్ ఎనర్జీ దిశగా తెలంగాణ.. సోలార్-బ్యాటరీ స్టోరేజ్ రంగాలపై ఫోకస్!..

రచన: Venu5 నిమిషాల పఠనం

తెలంగాణను దేశంలోనే గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.. ఈ క్రమంలో ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ’ ద్వారా పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, గ్రీన్ హైడ్రోజన్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది.

తెలంగాణను దేశంలోనే గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో ‘ప్రీమియర్ ఎనర్జీస్’ అత్యాధునిక సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కేవలం పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాదు... కంపెనీలు తెలంగాణలోనే ఇన్నోవేషన్ చేయాలని, ఇక్కడే తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని, ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రీమియర్ ఎనర్జీస్ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలు తెలంగాణను ఎంచుకోవడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, పెట్టుబడిదారులకు ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌తో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్, సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ’ ద్వారా పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, గ్రీన్ హైడ్రోజన్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.

ప్రపంచ ఇంధన రంగంలో ఈ ఏడాది 3.4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండగా, అందులో 2.2 ట్రిలియన్ డాలర్లు క్లీన్ ఎనర్జీ రంగానికే వచ్చే అవకాశమున్నట్టు అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేస్తోందని గుర్తు చేశారు. మరోవైపు ఏఐ, డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణతో దేశీయ విద్యుత్ డిమాండ్ 300 గిగావాట్లకు చేరే అవకాశం ఉందని, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుల పైప్‌లైన్ 260 గిగావాట్ అవర్స్‌కు చేరుకుందని తెలిపారు.

ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సోలార్, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ టెక్నాలజీ రంగాలపై తెలంగాణ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. భవిష్యత్ సవాళ్లను అధిగమించేందుకు, కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు సమగ్ర పారిశ్రామిక ఎకోసిస్టంను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

నేడు పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. అలాగే 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక సబ్సిడీలను దశలవారీగా చెల్లిస్తామని, సీతారాంపూర్‌లో భూములు ఇచ్చిన రైతుల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

#telangana#rangareddy#green energy.. Focus on solar-battery storage sectors
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి