తాజాగా కరీంనగర్‌లో పంచాయతీరాజ్ ఏఈ పైడి సతీష్ పది వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ దాడులు జరుగుతున్నా... అధికారులు జైలుకు వెళ్తున్నా... అవినీతిపరుల గుండెల్లో మాత్రం కొంచెమైనా భయం కనిపించడం లేదు! అసలు లోపం ఎక్కడుంది?
గతంలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో విఆర్ఓల నుండి కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది వరకు, మున్సిపల్, పోలీస్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎంతోమంది అధికారులు లక్షల్లో లంచాలు తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు. ఆ క్షణానికి వార్తల్లో నిలవడం, సస్పెండ్ కావడం... ఆ తర్వాత మళ్ళీ నెలల వ్యవధిలోనే బెయిల్‌పై బయటకు వచ్చి, తిరిగి ఉద్యోగాల్లో చేరిపోవడం పరిపాటిగా మారింది!
చట్టాల్లోని లొసుగులతో, కేసుల విచారణలో ఏళ్ల తరబడి జరిగే ఆలస్యం అవినీతిపరులకు రక్షణ కవచంగా మారుతోంది. చిక్కితే కొన్నాళ్ళు ఇంట్లో విశ్రాంతి... ఆ తర్వాత మళ్ళీ మామూలే అనే ధీమానే వారిని మరింత తెగించేలా చేస్తోంది.
ప్రభుత్వాలు ఇప్పటికైనా అవినీతి పట్ల "జీరో టాలరెన్స్" విధానాన్ని కఠినంగా అమలు చేయకపోతే... సామాన్యుడికి ప్రభుత్వ వ్యవస్థలపై ఉన్న నమ్మకం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది! ప్రజాస్వామ్య వ్యవస్థలకే ఇది పెను ముప్పుగా మారుతుంది.
అవినీతికి పాల్పడే వారిని కేవలం సస్పెండ్ చేయడమే కాదు... వారి ఆస్తులను జప్తు చేసి, శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించి, వేగవంతమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కఠిన శిక్షలు పడేలా చేయాలి. లేదంటే... ఏసీబీ దాడులు కేవలం ఒక రోజు వార్తగా మాత్రమే మిగిలిపోతాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..












