కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు (శుక్రవారం) విశాఖపట్నం రానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటల నుంచి నేవల్ డాక్‌యార్డ్‌లో భారత నావికాదళానికి చెందిన ఉన్నతాధికారులు, ఇతర కీలక సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై సముద్ర తీర భద్రత, రక్షణ రంగ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించనున్నారు.
నేవీ అమ్ములపొదిలోకి 'ఐఎన్ఎస్ మహేంద్రగిరి' ఈ పర్యటనలో భాగంగా రేపు (శనివారం) ఉదయం 9:50 గంటలకు విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక యుద్ధనౌక 'ఐఎన్ఎస్ మహేంద్రగిరి' కమిషనింగ్ వేడుకలో రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. స్వదేశీ సాంకేతికతతో అత్యాధునిక రక్షణ సామర్థ్యాలతో రూపుదిద్దుకున్న ఈ యుద్ధనౌకను ఆయన అధికారికంగా నావికాదళంలోకి ప్రవేశపెట్టనున్నారు.
భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచేలా, 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాలకు అద్దం పట్టేలా ఈ నౌకను సిద్ధం చేశారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా విశాఖకు.. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ వేడుక ముగిసిన అనంతరం రక్షణ మంత్రి తిరిగి ఢిల్లీకి ప్రయాణమవుతారు. కాగా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ కూడా ఈరోజు రాత్రి విశాఖ చేరుకోనున్నారు. ఆయన శనివారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న జేఎన్‌టీయూ-గురజాడ విజయనగరం మొదటి ఘటికోత్సవ (కాన్వొకేషన్) వేడుకల్లో పాల్గొననున్నారు.












