తెలంగాణలో పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో స్టీల్, సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
గురువారం హైదరాబాద్ సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి ధరలు, సరఫరా, పరిశ్రమల సహకారంపై ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో మంత్రులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా.. ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదని, పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత, ఆత్మగౌరవాన్ని కల్పించే మహా యజ్ఞమని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిలో సుమారు 85 శాతం ఇళ్లలో శ్లాబ్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మరో 2 లక్షల 50 వేల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అదనంగా సీఆర్డీఏ, క్యూఆర్ లేదా సంబంధిత పట్టణ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా వెయ్యి నుంచి వెయ్యిన్నర ఇళ్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.
ఇళ్ల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, మూడో, నాలుగో విడతల్లో కూడా మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రులు పేర్కొన్నారు.
ప్రభుత్వంపై ఎంతటి ఆర్థిక భారం పడినా పేదల ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీ పడబోమని, ప్రతి లబ్ధిదారుడికి విడతల వారీగా ప్రతి సోమవారం పారదర్శకంగా నిధులు విడుదల చేస్తున్నామని అన్నారు. ప్రతి పేద కుటుంబం సొంత ఇంటిలో నివసించే వరకు ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో తన బాధ్యతను నిర్వర్తిస్తుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్‌ను తక్కువ ధరలకు అందించాలని పరిశ్రమల యాజమాన్యాలను మంత్రులు కోరగా, వారు సానుకూలంగా స్పందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రతి వర్గం సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
పేదలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహాయం చేసే సంస్థలను ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని పేర్కొన్న మంత్రులు, పరిశ్రమల యాజమాన్యాలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి ఎలా చేరవేయాలనే అంశంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.












