షుగర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త.. రోజువారీగా ఇంజెక్షన్లు తీసుకుంటూ నరకం అనుభవిస్తున్న వారికి డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. నోవో నార్డిస్క్ (Novo Nordisk) పేరిట అద్భుత ఔషధాన్ని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ మెడిసన్‌ను వారానికి ఒకసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే చాలు. ప్రతిరోజూ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన పనిలేదు. ఆ మందు పేరు ‘Awiqli’.. లాంగ్-యాక్టింగ్ బేసల్ ఇన్సులిన్ ఐకోడెక్‌ను ఇవాళ భారత్‌లో లాంచ్ అయ్యింది.
ఏడాదికి 52 ఇంజెక్షన్లు చాలు..
షుగర్ లెవల్ ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. అనగా ఏడాదికి సుమారు 365 సార్లు. ఈ కొత్త ‘Awiqli’ ఇన్సులిన్ వల్ల రోగులు వారానికి ఒక్కసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే చాలు. ఫలితంగా ఏడాదికి ఇంజెక్షన్ల సంఖ్య కేవలం 52కి తగ్గనుంది. ఈ మెడిసిన్ పేషెంట్లకు శారీరక ఉపశమనంతో పాటు, మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. టైప్-1, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారి కోసం ప్రత్యేకంగా రూపొందించడం విశేషం.
ఇక ధర విషయానికొస్తే.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రోజువారీ బేసల్ ఇన్సులిన్ల ధరకు సమానంగా యూనిట్‌కు సుమారు రూ.3.5 పైసల చొప్పున దీని ధరను నిర్ణయించినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ మెడిసిన్ వాడితే వార్షిక చికిత్స ఖర్చులు దాదాపు 20 నుంచి 25 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్‌లో వారం రోజుల ఇన్సులిన్ పాత పద్ధతుల కంటే మెరుగ్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ (HbA1c)ను నియంత్రించినట్టు రుజువైంది. అందుకే ఇండియన్ డ్రగ్స్ అథారిటీ సైతం దీనికి అనుమతి ఇచ్చినట్టు తెలిసింది.












