తెలంగాణలో సంచలనం రేపుతున్న డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఏసీబీ దర్యాప్తు వేగం పెంచడంతో ఆయన ఆక్రమాస్తుల వెనుక ఉన్న అసలు కథ ఒక్కొక్కటిగా బయటపడుతోంది.
ఇప్పటికే దాదాపు 300 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో తాజాగా ఓ ప్రముఖ సినీ హీరో పేరు కూడా తెరపైకి రావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మణికొండలో ఓ విలువైన ఆస్తి అమ్మకానికి సంబంధించి ఆ హీరో, భీమ్‌రెడ్డితో ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఒప్పందంలో భాగంగా సుమారు 3 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే మిగిలిన చెల్లింపులు జరగాల్సిన సమయంలోనే ఏసీబీ దాడులు జరగడంతో ఆ వ్యవహారం వివాదాస్పదంగా మారిందని సమాచారం. దర్యాప్తులో కీలక ఆధారంగా మారిన భీమ్‌రెడ్డి డైరీలో ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆయన నివాసంలో నిర్వహించిన సోదాల్లో 60కి పైగా స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అయితే భీమ్‌రెడ్డి తన ఆస్తుల వ్యవహారంలో చాలా ముందు చూపుతో వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. బినామీల పేర్లపై ఆస్తులు నమోదు చేసే సమయంలో వారి చేత ముందుగానే క్యాన్సిలేషన్ డీడ్లు రాయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆయన ఇంట్లో నిర్వహించిన సోదాల్లో ఇలాంటి 30కి పైగా క్యాన్సిలేషన్ డీడీలు లభించాయని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం నివాసముంటున్న విల్లాను ఎలా కొనుగోలు చేశారనే ప్రశ్నకు భీమ్‌రెడ్డి సరైన సమాధానం ఇవ్వలేకపోయారని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సోదాల్లో రెండు మెమొరీ కార్డులు, రెండు లాకర్లకు సంబంధించిన వివరాలు, పది బ్యాంకు ఖాతాల సమాచారం కూడా బయటపడింది.
ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం భీమ్‌రెడ్డి నిర్వహించిన వ్యక్తిగత డైరీ. చార్ ధామ్ యాత్రకు వెళ్లే ముందు తన ఆస్తుల వివరాలు, బినామీల పేర్లు, ఆస్తుల పంపకాల సమాచారాన్ని పూర్తిగా రాసి భద్రపరిచినట్లు తెలుస్తోంది. అంతేకాక ఆ వివరాలను స్కాన్ చేసి వాట్సాప్ ద్వారా తన కుటుంబ సభ్యులకు పంపినట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఇక ఈ డిజిటల్ ఆధారాలు దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలుస్తోంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి, అదీ పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారి ఇంత భారీ ఆస్తులను ఎలా కూడబెట్టగలిగారనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సోదాల్లో బయటపడిన ఆస్తుల జాబితా కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇబ్రహీంబాగ్‌లోని విలాసవంతమైన విల్లా, గచ్చిబౌలి, టెలికాం నగర్, తెల్లాపూర్ ప్రాంతాల్లో ఫ్లాట్లు, నివాస గృహాలు, ల్యాంకో హిల్స్ రోడ్డులో కమర్షియల్ కాంప్లెక్స్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి 54 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు, భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు లభించినట్లు తెలుస్తోంది.
మరోవైపు మణికొండ ప్రాంతంలో జరుగుతున్న భారీ నిర్మాణాలపై కూడా ఏసీబీ దృష్టి సారించింది. నిరుపేదలకు కేటాయించిన 60 గజాల ఇంటి స్థలాల్లో నిర్మితమవుతున్న ఆకాశహర్మ్యాల వెనుక భీమ్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం.
మణికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన రెండు భారీ వాణిజ్య నిర్మాణాల వెనుక కూడా భీమ్‌రెడ్డి హస్తం ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రీలాంచ్ పేరిట ఇప్పటికే వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
రెవెన్యూ శాఖ నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లోనూ నిర్మాణాలు కొనసాగడం, సరైన అనుమతులు లేకుండానే భారీ కమర్షియల్ ప్రాజెక్టులు ముందుకు సాగడం వెనుక ఉన్న వ్యక్తుల పై అధికారులు దృష్టి సారించారు.. ఈ నిర్మాణాల్లో కొంత భాగం భీమ్‌రెడ్డి పేరుతో కూడా ఉన్నట్లు ఇప్పటికే వెల్లడైంది.
ప్రస్తుతం ఏసీబీ అధికారులు భీమ్‌రెడ్డి ఆస్తులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరితో ఆర్థిక లావాదేవీలు జరిగాయి, బినామీలు ఎవరు, మరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ కేసు కేవలం ఒక అధికారి అక్రమాస్తుల వ్యవహారంగా మాత్రమే కాకుండా, వ్యవస్థలోని పెద్ద నెట్‌వర్క్‌ను బయటపెట్టే అవకాశం ఉన్న కేసుగా మారింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.












