ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. భారత్‌లో ద్రవ్యోల్బణం పెరుగుతున్నా.. రూపీ విలువ పడిపోతున్నా.. అభివృద్ధిలో మాత్రం తగ్గడం లేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజా 'వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్' నివేదికలో వెల్లడించింది. భారత్‌ను మరోసారి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా స్పష్టంచేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత ఆర్థికవ్యవస్థ 6.4 శాతం వృద్ధి నమోదు చేస్తుందని పేర్కొంది. ఇది ఏప్రిల్ అంచనా కంటే స్వల్పంగా 0.1 శాతం తక్కువైనప్పటికీ 2027-28లో వృద్ధి 6.7 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. అందుకు ప్రధానంగా ప్రైవేట్ వినియోగం, సేవల రంగంలో కొనసాగుతున్న బలమైన వృద్ధి, దేశీయంగా డిమాండ్ భారత్‌కు ప్రధాన బలాలుగా నిలుస్తున్నాయని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది.
చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మందగించిన ప్రపంచ వాణిజ్యం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయ వినియోగం భారత ఆర్థికవ్యవస్థను ముందుకు తీసుకెళ్తుందని ఐఎంఎఫ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ వృద్ధికి సంబంధించి పశ్చిమాసియా ఘర్షణలు, ఇంధన ధరల పెరుగుదల ప్రభావంతో 2026లో ప్రపంచ వృద్ధి 3.0 శాతానికి తగ్గుతుందని, 2027లో 3.4 శాతానికి పుంజుకుంటుందని తెలిపింది. కాగా, ఏఐ ఆధారిత టెక్నాలజీ విస్తరణ ప్రపంచ వృద్ధికి కొత్త ఊపునిస్తోందని కూడా నివేదిక తెలిపింది.












