తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ (గిరిజన సంక్షేమ) బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం అల్పాహారం (టిఫిన్) తిన్న 26 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో విద్యార్థులు విలవిలలాడటంతో పాఠశాల సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అయితే, విద్యార్థులను తొలుత తరలించిన మన్ననూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని దయనీయ పరిస్థితులు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. ఆసుపత్రిలో కనీసం సరిపడా బెడ్స్ కూడా లేకపోవడంతో, తీవ్ర అస్వస్థతతో ఉన్న విద్యార్థులను వైద్యులు నేలపైనే పడుకోబెట్టి ప్రాథమిక చికిత్స అందించాల్సి వచ్చింది. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువవ్వడం పట్ల స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్ననూరులో పరిస్థితి చేయిదాటడంతో, మెరుగైన వైద్యం కోసం విద్యార్థులను అత్యవసరంగా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పాఠశాలలో తమకు ఎదురవుతున్న నరకప్రాయమైన పరిస్థితులపై విద్యార్థులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం అందించకపోగా, కనీసం తాగడానికి సురక్షితమైన నీరు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధితుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. గురుకులాల్లో వరుసగా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా అధికారులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.












