క్రైమ్

పోలీస్ స్టేషన్ భూమి కబ్జా.. రంగంలోకి దిగిన హైడ్రా!..

రచన: Venu3 నిమిషాల పఠనం

కాదేది కబ్జా కోరులకు అడ్డం..! ప్రభుత్వ భూములైనా, చెరువులైనా, పార్కులైనా.. కబ్జాదారుల కన్ను పడితే చాలు ఆక్రమణలకు గురవుతున్నాయి.

కాదేది కబ్జా కోరులకు అడ్డం..! ప్రభుత్వ భూములైనా, చెరువులైనా, పార్కులైనా.. కబ్జాదారుల కన్ను పడితే చాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. నగరాల నుంచి గ్రామాల వరకు విలువైన భూముల్లో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల హెచ్చరికలు, చట్టాలున్నా కబ్జా దందా మాత్రం ఆగడం లేదు.

తాజాగా ప్రభుత్వ భూములపై కన్నేసిన ఆక్రమణదారులకు హైడ్రా గట్టి షాక్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ మండలం కొత్తపేట్ గ్రామంలో పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణల నుంచి విముక్తి చేసి రక్షణ చర్యలు చేపట్టింది.

చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సర్వే నంబర్లు 135, 136లో ఉన్న మొత్తం 6 గుంటల భూమిని కేటాయించింది. ఇందులో సర్వే నంబర్ 135లో 4 గుంటలు, సర్వే నంబర్ 136లో 2 గుంటల స్థలం ఉంది. అయితే కొందరు వ్యక్తులు సర్వే నంబర్ 135లోని ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి షెడ్లు నిర్మించారు.

ఈ విషయాన్ని గుర్తించిన పోలీస్ శాఖ వెంటనే స్పందించి, ఆక్రమణలను తొలగించాలని హైడ్రా అధికారులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి.. విచారణలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో చర్యలకు దిగింది.

హైడ్రా సిబ్బంది భారీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహించి అక్రమంగా నిర్మించిన షెడ్లను పూర్తిగా తొలగించారు. అంతేకాకుండా భవిష్యత్తులో మరోసారి ఆక్రమణలు జరగకుండా మొత్తం 6 గుంటల స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ భూమి పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలం అని స్పష్టంగా తెలియజేస్తూ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ భూములను కాపాడటం, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను పరిరక్షించడం తమ బాధ్యత అని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం కఠినంగా వ్యవహరించక తప్పదని స్పష్టం చేశారు.

#telangana#rangareddy#hydra#police-station#land#hyderabad
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి