క్రైమ్

ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు.. రావణ్‌కు కొత్త చిక్కులు!

రచన: Venu4 నిమిషాల పఠనం

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, నిషేధిత మావోయిస్టు సంస్థకు మద్దతుగా మాట్లాడిన ఆరోపణలతో ఇప్పటికే అరెస్టై రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న రావణ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది.

యూట్యూబ్‌లో వివాదాస్పద వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ కేసులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. విద్వేషపూరిత కంటెంట్‌ను ప్రచారం చేస్తూ ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా నెలకు లక్షన్నర రూపాయలకు పైగా ఆదాయం పొందినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. దీంతో అతని ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించిన కాకినాడ పోలీసులు, సంబంధిత బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని రెండు వేర్వేరు బ్యాంకులకు లేఖలు పంపించారు.

పోలీసుల అభ్యర్థన మేరకు బ్యాంకు అధికారులు ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. ఇక రావణ్ మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించిన దర్యాప్తు అధికారులు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఫోన్‌లో తొలగించిన డేటాను రికవర్ చేసిన అనంతరం అనేక సంచలన విషయాలు బయటపడినట్లు సమాచారం. ముఖ్యంగా వాట్సాప్ చాటింగ్‌లు, డిలీట్ చేసిన ఫైళ్లు, వీడియోల ద్వారా కొత్త కోణాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, నిషేధిత మావోయిస్టు సంస్థకు మద్దతుగా మాట్లాడిన ఆరోపణలతో ఇప్పటికే అరెస్టై రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న రావణ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఫోరెన్సిక్ విశ్లేషణలో పలువురు యువతులతో అతను తీసుకున్న వ్యక్తిగత వీడియోలు గుర్తించినట్లు సమాచారం.

హోటల్ గదుల్లో చిత్రీకరించిన కొన్ని వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ ప్రారంభమయ్యే ముందు వాటిని డిలీట్ చేసినప్పటికీ, ఫోరెన్సిక్ నిపుణులు వాటిని తిరిగి రికవర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాల వెనుక రావణ్ ఒక్కడే ఉన్నాడా? లేక మరెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ముఖ్యంగా అతని ఆర్థిక లావాదేవీలతో పాటు సోషల్ మీడియా కార్యకలాపాలు, వివిధ వ్యక్తులతో ఉన్న సంబంధాలపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. హిందూ దేవతలు, ప్రజాప్రతినిధులు, కులాలు, మతాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులతో పాటు, ఇప్పుడు బయటపడుతున్న డిజిటల్ ఆధారాలు కూడా రావణ్‌ కేసులో కీలక మలుపుగా మారాయి.. ఈ కేసులో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది.

#andhra-pradesh#youtuber-ravan#bank-accounts#freeze#forensic report#trouble
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి