International

కొరియాలో లోకేశ్‌ పర్యటన.. ఏపీకి కియా ఈవీ హబ్, ఎక్స్‌పోర్ట్ సెంటర్

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ఏపీకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు.

ఏపీకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సియోల్‌లో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం 'కియా మోటార్స్‌' ఉన్నతస్థాయి ప్రతినిధులతో పాటు ఆ దేశ విదేశాంగ శాఖ ఉపమంత్రితో కీలక సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతంగా వివరిస్తూ, పలు వ్యూహాత్మక ప్రతిపాదనలను వారి ముందు ఉంచారు.

కియా గ్లోబల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టే హన్ లీతో జరిగిన భేటీలో.. అనంతపురంలో ఉన్న కియా ప్లాంట్‌ను మరింత విస్తరించాలని లోకేశ్‌ కోరారు. ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ), హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రంతో పాటు ఈవీ బ్యాటరీ సిస్టమ్స్, పవర్‌ట్రెయిన్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే, అంతర్జాతీయ మార్కెట్లకు సులభంగా ఎగుమతులు చేసుకునేందుకు వీలుగా విశాఖపట్నం పోర్టు సమీపంలో ఒక అసెంబ్లింగ్, ఎక్స్‌పోర్ట్ సెంటర్‌ను స్థాపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై కియా ప్రతినిధి సానుకూలంగా స్పందించారు.

అనంతరం దక్షిణ కొరియా విదేశాంగశాఖ ఉపమంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్‌తో మంత్రి సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న 3S (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) విధానం కొరియా పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ కవచంలా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ సరఫరా శృంఖల (సప్లయ్ చైన్) నష్టాలను తగ్గించుకోవడానికి తూర్పు తీరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అత్యంత సురక్షితమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయ వేదిక అవుతుందని లోకేశ్‌ వివరించారు.

పరిశ్రమలతో పాటు నైపుణ్యాభివృద్ధి, సాంస్కృతిక బంధానికి ఏపీ పెద్దపీట వేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కొరియన్ సంస్థల పని విధానం, భాషపై స్థానిక యువతకు శిక్షణ ఇచ్చేందుకు 'జాయింట్ ట్రెయినింగ్ అకాడమీలను' ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో కొరియన్ కల్చరల్ సెంటర్, 'ఏపీ-కొరియా ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్' ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు విశాఖపట్నం-బుసాన్ నగరాల మధ్య అనుసంధానత, డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీకి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

#Apnews#naralokesh#lokeshkoreatour#aplatestnews#telugu news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి