హిమాలయాల్లో శివనామస్మరణ మారుమోగుతోంది. పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు ఈ ఏడాది భక్తులు రికార్డు స్థాయిలో తరలివస్తున్నారు. యాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 1.60 లక్షల మందికి పైగా యాత్రికులు పవిత్ర గుహలోని మంచు లింగాన్ని దర్శించుకున్నారు. యాత్ర సజావుగా సాగుతున్న తరుణంలో.. ఇవాళ జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి 8,796 మంది భక్తులతో కూడిన 9వ బృందం కశ్మీర్ లోయకు బయల్దేరింది.
మొత్తం 354 వాహనాల్లో బయల్దేరిన ఈ బృందంలో 33 మంది విదేశీయులతో పాటు సాధువులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. వీరంతా ప్రత్యేక భద్రతా కాన్వాయ్‌ల నడుమ బల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంపులకు చేరుకోనున్నారు. శ్రీనగర్ శివార్లలోని పంథా చౌక్ యాత్రి శిబిరాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సందర్శించి భక్తులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు, పర్యాటక రంగానికి ఎంతో ఊపునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
యాత్రికులంతా జమ్మూకశ్మీర్ చేతివృత్తులు, చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి స్థానిక కళాకారులను ప్రోత్సహించాలని, ఇది 'ఒక జిల్లా ఒక ఉత్పత్తి' (వోడీవోపీ) స్ఫూర్తిని బలపరుస్తుందని ఎల్జీ పేర్కొన్నారు. మరోవైపు యాత్రికులను మోసం చేస్తూ నకిలీ రిజిస్ట్రేషన్లతో డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు స్థానిక ఉపాధ్యాయులను అధికారులు సస్పెండ్ చేసి, అదుపులోకి తీసుకున్నారు. గందర్‌బల్ జిల్లాలోని మణిగామ్ క్యాంపులో ఈ మోసం వెలుగుచూసింది. కాగా, ఈ నెల 3న ప్రారంభమైన ఈ అమర్‌నాథ్ యాత్ర 56 రోజుల పాటు కొనసాగి, ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినంతో ముగియనుంది.












