ప్రభుత్వ ఆస్తులను అక్రమార్కుల నుండి కాపాడటానికి రేవంత్ రెడ్డి హైడ్రా ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.. ఎన్నో విమర్శలు, ప్రశంశలు మధ్య ఈ హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే తాజాగా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అమలులో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని.. హైడ్రా పేరును అడ్డం పెట్టుకుని హైదరాబాద్‌లోని నిరుపేదలను రేవంత్ సర్కార్ ఆగం చేస్తుందని కవిత మండిపడ్డారు. పేదల పట్ల చిత్త శుద్ధి ఉంటే.. అందరినీ ఒకేలా చూడాలని.. కానీ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొంటూ.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన విద్యాసంస్థల విషయంలో మాత్రం ఎలాంటి చర్యలను తీసుకోకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు.
చివరికి వారి ఆస్తులను కాపాడటానికి ఏకంగా కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తోందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. చెరువులను కబ్జా చేసి ఒవైసీ విద్యాసంస్థల నిర్మాణాలు జరిగాయనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. చెరువును కబ్జా చేసి కట్టిన కాలేజీ ప్రపంచమంతా చూస్తున్నా.. సీఎం రేవంత్ రెడ్డి కి మాత్రం కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
దీన్ని బట్టి చూస్తే తక్షణమే ఆయనకు కంటి పరీక్ష చేయించుకోవలసిన అవసరం ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలుస్తూ, వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రేవంత్ సర్కార్.. బడాబాబుల ఆక్రమణలను మాత్రం అండగా ఉంటూ.. వారి ఆస్తులను కాపాడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.












