Yogi Adityanath: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నోయిడా జెవార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటున్న ఈ ఎయిర్‌పోర్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు పెట్టాలని డిసైడ్ అయ్యింది. లక్నోలో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనను ఆమోదించారు.
25 ఏళ్ల పాలనా ప్రస్థానానికి అరుదైన కానుక
ప్రజాసేవలో గుజరాత్ సీఎం, దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని, ప్రధాని గౌరవార్థం జెవార్ ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం యోగి వెల్లడించారు. ఈ సందర్భంగా మోడీకి అభినందనలు తెలిపిన ఆయన.. ప్రధాని లీడర్‌షిప్‌లో ఇండియా వరల్డ్ లెవెల్‌లో సరికొత్త ఎత్తులకు చేరిందని ప్రశంసించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూనే, దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
యూపీతో ప్రత్యేక అనుబంధం..
ప్రధాని మోడీకి, ఉత్తర ప్రదేశ్‌కు మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని సీఎం యోగి గుర్తుచేశారు. కేంద్రం - రాష్ట్రం మధ్య పూర్తి సమన్వయంతో 'టీమిండియా' స్పిరిట్‌తో పనిచేస్తున్నామని, ఈ 'డబుల్ ఇంజిన్' సర్కార్ వల్లే యూపీ రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. 2017కు ముందు రాష్ట్రంలో పాలనా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించేదని, ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా దక్కని దుస్థితి ఉండేదని విమర్శించారు. అలాంటి రాష్ట్రాన్ని ప్రధాని స్ఫూర్తితోనే అభివృద్ధి బాట పట్టించామని, యూపీ మంత్రుల బృందం ప్రధానికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో దేశ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.












