* చిత్రపురి కాలనీలో మిగిలిన 4 ఎకరాల భూమి కబ్జాకు గురికాకుండా కాపాడాలి
* మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెంటనే చిత్రపురి కాలనీలో అక్రమాలపై స్పందించాలి
* తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
* టీఆర్ఎస్ చీఫ్‌తో చిత్రపురి కాలనీ సాధన సమితి నాయకులు భేటీ
Kavitha: చిత్రపురి కాలనీ సోసైటీలో అవినీతి, అక్రమాలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ అనే వ్యక్తి.. సొసైటీలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒకే వ్యక్తి ఇంత అవినీతికి పాల్పడటానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని మంత్రుల సహకారం ఉందన్నారు. అనిల్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కవిత ప్రశ్నించారు. చిత్రపురి కాలనీ సాధన సమితి నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు కవిత.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు అవినీతి
ఫిల్మ్ ఫెడరేషన్‌లోని అన్ని విభాగాలను చెరబట్టిన అనిల్.. ఇప్పటికీ చిత్రపురి కాలనీలో అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సినీ కార్మికులకు మేలు చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నటుడు ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీకి 1994లో 67 ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. వాటిలో కార్మికులకు ఇళ్లను కేటాయించే విషయానికి సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు పెద్దఎత్తున అవినీతి జరిగిందని చెప్పారు. అప్పటి మంత్రుల సహకారంతో అవినీతికి పాల్పడిన అనిల్... ఇప్పుడు కాలనీలో మిగిలి ఉన్న 4 ఎకరాల భూమిపై కన్నేశారని ఆరోపించారు.
భూమిని తాకట్టు పెట్టి రూ.19 కోట్లు తీసుకున్నాడు
కో ఆపరేటివ్ సోసైటీ రూల్స్‌ను తుంగలో తొక్కి ఆ భూమిని మార్టిగేజ్ పెట్టి రూ.19 కోట్లు తీసుకున్నారని అన్నారు. తాజాగా ఆ భూముల్లో ఫ్లాట్లు కడుతున్నామంటూ నిసిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇంత బాహాటంగా ఫ్లాట్లు కడుతున్నామంటూ అవినీతికి పాల్పడుతుంటే.. కో ఆపరేటివ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర రావు ఏం చేస్తున్నారని కవిత ప్రశ్నించారు. వెంటనే ఈ భూమి విషయంలో జోక్యం చేసుకుని ఆ భూమిని పేద సినీ కార్మికులకు ఇళ్ల నిర్మాణం కోసం ఉపయోగించాలని డిమాండ్ చేశారు.
అనిల్‌ను వెంటనే తొలగించాలి
ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్‌ను వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు కవిత. ఫ్లాట్ల విషయంలోనే కాకుండా అక్కడ ఇళ్ల సముదాయాలను బట్టి కూడా వసూళ్లకు పాల్పడ్డారని అన్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ కోసం సోసైటీ వాళ్ల నుంచి 2 లక్షలు వసూలు చేశారని చెప్పారు. మళ్లీ ఆదివారం జరగనున్న సీఎం సభ కోసం మరోసారి 2 లక్షలు కావాలంటూ బెదిరిస్తున్నాడని చెప్పారు.
ఆ రూ.10కోట్లు అనిల్‌కు ఇవ్వొద్దు
అదే విధంగా తోట రామకృష్ణ అనే సీనియర్ డైరెక్టర్‌కు కేటాయించిన ఇంటిని వేరే వాళ్లకు అమ్మారని.. అడిగితే బాధితులను బెదిరిస్తున్నారని.. అయినప్పటికీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని కవిత ప్రశ్నించారు. ఆదివారం జరిగే సభలో ముఖ్యమంత్రి 10 కోట్ల రూపాయలు కేటాయిస్తారని చెబుతున్నారని దాన్ని అనిల్‌కు ఇవ్వద్దని సూచించారు.
ఆయన ద్వారా న్యాయం జరుగుతుందన్న నమ్మకం చిత్రపురి కాలనీ వాసులకు లేదని.. ఆ మొత్తాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ కార్పొరేషన్‌కు కేటాయించాలని కవిత కోరారు. ప్రస్తుతం చిత్రపురి కాలనీలో భూమి విలువ 7వేల కోట్లు ఉంటుందని.. అలాంటి చోట ఒకే వ్యక్తి ఇంత అవినీతి చేస్తుంటే ఎందుకు శిక్ష పడటం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. వెంటనే అనిల్‌ను ఫెడరేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించి, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలి
సినీ కార్మికులు ఎంతో కష్టపడి ఇల్లు కొనుక్కుంటే వారికి అన్యాయం జరుగుతోందని.. ఈ విషయంలో సినీ పెద్దలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, సురేష్ బాబు, దిల్ రాజు లాంటి వాళ్లు జోక్యం చేసుకోవాలని కవిత కోరారు. అలాట్‌మెంట్ కమిటీలో ఉన్న కాంగ్రెస్‌కు చెందిన పీవీ శ్రీనివాస్ సతీమణికి ఇల్లు కేటాయించారని ఆరోపించారు. అలాట్‌మెంట్ కమిటీలో ఉన్న ఆమెకు ఇల్లు ఎలా కేటాయిస్తారని కవిత ప్రశ్నించారు. అదే కమిటీలో ఉన్న సుద్దాల అశోక్ తేజ ఈ విషయంలో అక్కడ జరుగుతున్న అవినీతిని బయటకు వచ్చి చెప్పాలన్నారు.
అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్
మరో రెండేళ్లలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు సినీ కార్మికులకు న్యాయం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు కవిత. చిత్రపురి కాలనీలో జరుగుతున్న అన్యాయంపై బాధితులతో కలిసి తాము పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. కవితను కలిసిన వారిలో చిత్రపురి కాలనీ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి శ్రీనివాస్, సుదీర్ కలగర, రవీంద్ర నాథ్ ఠాగూర్, తోట హరిత, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.












