తెలంగాణ

Hyderabad: నిమ్స్ ఆస్పత్రి మెయిన్ క్యాంటీన్ టెండర్లలో భారీ అక్రమాలు.. మండిపడుతున్న ప్రజా సంఘాలు!!..

రచన: Venu••5 నిమిషాల పఠనం

పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి మెయిన్ క్యాంటీన్ టెండర్లలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టెండర్ నిబంధనలను పక్కనబెట్టి, అనర్హులకు కాంట్రాక్టును కట్టబెట్టేందుకు కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యారనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి మెయిన్ క్యాంటీన్ టెండర్లలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టెండర్ నిబంధనలను పక్కనబెట్టి, అనర్హులకు కాంట్రాక్టును కట్టబెట్టేందుకు కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యారనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ ఎంఆర్‌పిఎస్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి. నవీన్ రాజ్ స్పందిస్తూ పారదర్శక విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు..

మరోవైపు నిమ్స్ ఆస్పత్రి మెయిన్ క్యాంటీన్ కేటాయింపు ప్రక్రియ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. క్యాంటీన్ నిర్వహణ టెండర్లలో లక్షల రూపాయల కుంభకోణం జరుగుతోందని తెలంగాణ ఎంఆర్‌పిఎస్ యువజన సంఘం సంచలన ఆరోపణలు చేస్తుంది. కాగా ఈ ఏడాది జూన్ 6న నిమ్స్ యాజమాన్యం క్యాంటీన్ టెండర్ డాక్యుమెంట్ను విడుదల చేసింది. ఆ తర్వాత జూన్ 20న ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించి, జులై 14 వరకు బిడ్ల దాఖలుకు ఆఖరి తేదీగా నిర్ణయించారు.

అయితే, ఆశించిన స్థాయిలో కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాకపోవడంతో, బిడ్ దాఖలు గడువును జులై 21 వరకు పొడిగించారు. ఈ క్రమంలో ప్రిసమ్, నక్షత్ర, సూర్యనారాయణ ఫుడ్ సప్లయర్స్ తో పాటు మొత్తం నాలుగు సంస్థలు బిడ్లను దాఖలు చేశాయి.. అయితే, కాంట్రాక్ట్ దక్కించుకోవాలనుకునే సంస్థకు నిమ్స్ టెండర్ నిబంధనల ప్రకారం కనీసం మూడేళ్ల పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో క్యాంటీన్ నిర్వహించిన లేదా ఆహార సరఫరా చేసిన అనుభవం ఉండాలనే నియమం ఉంది.

అంతేకాకుండా, గత రెండేళ్ల కాలంలో కనీసం రూ.25 కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహించిన వారు అర్హులనే నిబంధన విధించారు. కానీ, దరఖాస్తు చేసుకున్న నాలుగు సంస్థల్లో ఏ ఒక్కటీ ఈ నిబంధనలలో లేవు.. కేవలం రెండు సంస్థలకు మాత్రమే మూడేళ్ల అనుభవం ఉండగా, రూ.25 కోట్ల టర్నోవర్ నిబంధనను ఏ ఒక్క సంస్థ కూడా పూర్తి చేయలేకపోయింది.

ఇక నిబంధనల ప్రకారం బిడ్లలో పాల్గొన్న నాలుగు సంస్థలకూ అర్హత లేకపోవడంతో, ఈ టెండర్లను రద్దు చేసి తిరిగి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయవలసి ఉంది. కానీ, నిమ్స్ అధికారులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. కేవలం మొక్కుబడిగా ఒక సంస్థను డిస్ క్వాలిఫై చేసి, మిగిలిన మూడు సంస్థలను ఎల్-1, ఎల్-2, ఎల్-3గా ఎంపిక చేశారని నవీన్ రాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరోవైపు అర్హత లేని ఓ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు నిమ్స్ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని, ఈ కుట్రలో దాదాపు 50 లక్షల రూపాయల వరకు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు కలిసి ఈ కుంభకోణానికి తెరలేపారని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి..

ఈ నేపథ్యంలో నిమ్స్ మెయిన్ క్యాంటీన్ కేటాయింపు టెండర్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్‌పిఎస్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ రాజ్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కోరారు. అలాగే ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి, పారదర్శకంగా కొత్త టెండర్లు నిర్వహించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

#NIMS Canteen Scam#Telangana News#Corruption Allegations#NIMS Hospital Tender#Naveen Raj MRPS#CM Office Complaint#Panjagutta NIMS#Tender Irregularities#Re Tendering Demand#Telangana Corruption Probe
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి