తెలంగాణ

Hyderabad: ఏళ్ల తరబడి వేధింపులు.. మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన గజల్ వాగ్గేయకారిణి!!..

రచన: Venu••9 నిమిషాల పఠనం

తెలంగాణ తొలి తెలుగు మహిళా గజల్ వాగ్గేయకారిణిగా గుర్తింపు పొందిన హిమజారామం.. కుటుంబ సభ్యుల నుంచి ఏళ్ల తరబడి వేధింపులు ఎదుర్కొంటున్నానని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు.

తెలంగాణ తొలి తెలుగు మహిళా గజల్ వాగ్గేయకారిణిగా గుర్తింపు పొందిన హిమజారామం.. కుటుంబ సభ్యుల నుంచి ఏళ్ల తరబడి వేధింపులు ఎదుర్కొంటున్నానని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా తన భర్త మేకల శ్రీధర్‌తో పాటు తోడబుట్టిన అన్నలు ఇందు సాగర్, రఘురాంల నుంచి గృహహింస, ఆర్థిక ఇబ్బందులు, ఆస్తి వివాదాలు, మానసిక వేధింపులు ఎదురవుతున్నాయని ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరుతూ హిమజారామం.. తన ఇద్దరు కుమారులతో కలిసి కమిషన్‌ను ఆశ్రయించారు. ఇక ఆమె చేసిన ఫిర్యాదులో ప్రధానంగా భర్త ప్రవర్తన, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఆస్తి వివాదాలకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. తన భర్త మద్యపానానికి బానిసై, వ్యాపారాల పేరుతో క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా అప్పులు చేస్తూ కుటుంబ బాధ్యతలను విస్మరించేవారని ఆమె ఆరోపించారు.

భాధ్యతలు మరచి అప్పుల కారణంగా కుటుంబాన్ని వదిలివెళ్లిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2013–14లో పెద్ద మొత్తంలో అప్పులు చేసి కుటుంబానికి దూరమైన వ్యవహారంలో అప్పటి ఖమ్మం జిల్లా ఎస్పీ రంగనాథ్ స్వయంగా విచారణ జరిపినట్లు ఆమె ఫిర్యాదులో వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు 2007లో కుటుంబ పెద్దల సమక్షంలో తన వివాహం జరిగిందని, అయితే పెళ్లికి ముందు భర్త విద్యార్హతలు, ఆర్థిక పరిస్థితి, వ్యక్తిగత అలవాట్లకు సంబంధించి వాస్తవాలు వెల్లడించలేదని హిమజారామం ఆరోపిస్తున్నారు.

ఇక వివాహం తర్వాత ఇద్దరు కుమారులు జన్మించినప్పటికీ భర్త ప్రవర్తనలో మార్పు రాలేదని, అప్పులు చేయడం, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, ఇంటి నుంచి వెళ్లిపోవడం వంటి పరిణామాలు కొనసాగాయని పేర్కొన్నారు. వరకట్నంగా 60 తులాల బంగారం ఇచ్చిన తర్వాత వ్యాపార నష్టాల పేరుతో మరింత బంగారం తీసుకున్నారని, మొత్తం 105 తులాల వరకు బంగారం తీసుకున్నప్పటికీ అదనపు డబ్బు కోసం వేధింపులు కొనసాగించారని ఆరోపించారు.

అలాగే ఈ వివాదాలకు తోడు తన అన్నయ్యలతో ఆస్తి విషయంలోనూ విభేదాలు ఉన్నాయని హిమజారామం ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్తిలో తనకు వాటా దక్కకుండా చేసేందుకు భర్తతో కలిసి తనపై దాడి చేయించారని ఆరోపించారు. సుమారు రెండున్నరేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చిందని, దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో కొనసాగుతోందని ఈ సందర్భంగా తెలిపారు.

మరోవైపు తన తల్లి భైరి ఇందిరతో సహజీవనం చేసిన ఖాదర్ వద్ద ఇందు సాగర్, రఘురాం పెరిగారని, తాను మాత్రం అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగినట్టు హిమజారామం ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక తన తల్లి మరణానంతరం తనకు అందాల్సిన ఆర్థిక సహాయం, ఇతర ప్రయోజనాల విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని, భర్తతో కలిసి జీవించడం కష్టంగా మారినప్పటికీ, అతనితోనే ఉండాలంటూ అన్నయ్యలు ఒత్తిడి చేశారని ఆరోపించారు.

మరోవైపు, తన అన్నలు భర్త వ్యసనాల కోసం ఇచ్చిన డబ్బును తిరిగి వసూలు చేసుకుంటూనే, తనకు సహాయం చేస్తున్నామని బంధువుల వద్ద ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. తనకు మానసిక సమస్యలు ఉన్నాయంటూ ప్రచారం చేసి బంధువులకు దూరం చేశారని, తన తండ్రితోనూ సంబంధాలు దెబ్బతినేలా వ్యవహరించారని ఆమె ఆరోపించారు..

అదేవిధంగా సుమారు 20 ఏళ్లుగా నివసిస్తున్న ఇంటికి సంబంధించి హోమ్ లోన్ చెల్లింపుల బ్యాంకు స్టేట్‌మెంట్లు తన వద్ద ఉన్నప్పటికీ, ఆ ఇంటిని తామే కొనిచ్చామని అన్నయ్యలు చెబుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళాకమిషన్ కు ఫిర్యాదు చేశారు. తన తల్లి జీవించి ఉన్న సమయంలో షూరిటీ సంతకం తీసుకున్నారని, ఆమె మరణం తర్వాత రుణ చెల్లింపులు నిలిచిపోవడంతో కోర్టు వివాదంలో తాను చిక్కుకున్నానని.. ఈ పరిణామాల వల్ల తన నివాసాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని హిమజారామం ఆవేదన వ్యక్తం చేశారు.

తన ఇద్దరు కుమారుల సంరక్షణ బాధ్యతలు తీసుకుని పెంచుతున్నానని, వారు చదువులో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తూ ఉన్నత విద్యలో ముందుకు సాగుతున్నారని, అయితే, పిల్లలను లక్ష్యంగా చేసుకుని అపార్ట్‌మెంట్ పరిసరాల్లో ఇబ్బందులకు గురిచేయడం, వారి తండ్రి గురించి ప్రశ్నలు అడగడం, తనను అవమానించేలా మాట్లాడించడం వంటి చర్యలు జరిగాయని హిమజారామం ఆరోపించారు.

అపార్ట్‌మెంట్‌లోని వాట్సాప్ గ్రూపుల్లో పిల్లలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, వీడియోలను పోస్టు చేసి అవమానకర వ్యాఖ్యలు చేశారని, నిఘా పెట్టి వేధింపులకు గురిచేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు తన సమస్యల విషయంలో సాహిత్య రంగంలో తనకు మద్దతుగా నిలుస్తున్న రచయితలు, పరిచయస్తులు, న్యాయవాదులకు ఫోన్లు, సందేశాలు పంపించి తనకు సహకరించవద్దని చెప్పినట్లు కూడా హిమజారామం ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన విచారణ జరగలేదని ఆమె ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై వేధింపులకు సంబంధించి ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. కుటుంబ వివాదాలు, ఆస్తి సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లతో పాటు వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశాలపై అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపిన హిమజారామం తన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, తనకు న్యాయం చేయాలని మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద.. హిమజారామం ఎదుర్కొంటున్నట్లు తెలిపిన వేధింపుల ఆరోపణలను పరిశీలిస్తామని వెల్లడించినట్లు సమాచారం. ఇప్పటికే నమోదైన అట్రాసిటీ, చీటింగ్ తదితర కేసులను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అంశాలపై విచారణ జరిపేలా చర్యలు తీసుకుంటామని, బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది..

#Himaja Ramam#Telangana Women Commission#Domestic Violence#Family Harassment#Dowry Harassment#Property Dispute#Women Safety#Swachha News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి