* జీవో 59 దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్
* 500 చదరపు గజాలలోపు పెండింగ్ దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం
* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
* 22ఏ పై శరవేగంగా ముఖ్యమంత్రి హామీల అమలు
* 22ఏ భూ సమస్యలపై ఇప్పటివరకు ఏడు ఉత్తర్వులు జారీ
* మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల 16న 22ఏ భూ సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర శాసనసభలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉన్నత స్ధాయి కమిటీ ఏర్పాటుతో కలుపుకుంటే ఆరు ఉత్తర్వులను ఇచ్చామన్నారు.
నెల రోజుల్లోగా పరిష్కారం
తాజాగా జి.ఓ. ఎంఎస్. నెం.59 కింద 500 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో నెంబర్లు 14, 22, 29, 41 అనుగుణంగా మెమో నెంబర్ 48030ను జారీ చేశామని వెల్లడించారు.
చిన్న పొరపాటు కూడా జరగొద్దు
దరఖాస్తుల పరిశీలనలో ఏమైనా అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు వివరించారు. జీవో 59 పరిధిలోని ఆస్తుల విషయంలో అసలు భూమి రికార్డులు, లబ్దిదారుల అర్హత, క్రమబద్దీకరించాల్సిన విస్తీర్ణం తదితర అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
గతంలో జరిగిన అక్రమాలు రిపీట్ కావొద్దు
శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వంలో 59 జీవోను అనుసరించి కొన్ని అక్రమాలు జరిగాయని తమ దృష్టికి రావడంతో జీవో అమలును నిలిపివేయడం జరిగిందన్నారు. అలాంటి తప్పులు పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే పరిష్కరించిన కన్వేయన్స్ డీడ్స్ జారీ అయిన కేసులను కూడా సమగ్రంగా పరిశీలించాలన్నారు.
ఒక్కో సమస్యకు పరిష్కారం
శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.
కోర్టుల ఆదేశాలకు లోబడి తుది నిర్ణయం
గతంలో జి.ఓ.59 కింద క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనేక కారణాలతో వాటిని సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచారని.. దీంతో చిన్నచిన్న ఇళ్ల స్థలాలు, ఆస్తులకు సంబంధించిన సమస్యలతో సామాన్య ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి పొంగులేటి చెప్పారు. న్యాయస్థానాల పరిధిలో ఉన్న దరఖాస్తులు, వివాదాస్పద అంశాల విషయంలో సంబంధిత కోర్టులు ఇచ్చే ఆదేశాలకు లోబడి మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.
22ఏ సమస్యలకు వరుస పరిష్కారాలు
గత నెల 16న శాసనసభ వేదికగా సీఎం రేవంత్ 22ఏ సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలకు అనుగుణంగా సహచర మంత్రులతో చర్చించి 22ఏ తో ముడిపడి ఉన్న 10 నుంచి 12 సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22-ఏ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
ఆ తర్వాత జి.ఓ 118, జి.ఓ 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలను జారీ చేశామని తెలిపారు. 22-ఏ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇవ్వడం.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారం.. నాలా ప్రక్రియ పూర్తి కాని పట్టా భూముల సమస్యకు పరిష్కారం, తాజాగా 59 జీవో అమలు దరఖాస్తుల పరిష్కారానికి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి పొంగులేటి వివరించారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు..
* 22ఏ సమస్యలపై సీఎం రేవంత్ ఇచ్చిన హామీల అమలులో మరో కీలక ముందడుగు
* 22ఏ సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు ఏడు కీలక ఉత్తర్వులు
* జి.ఓ. 59 దరఖాస్తుదారులకు శుభవార్త
* 500 చదరపు గజాలలోపు జి.ఓ. 59 పెండింగ్ దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం
* కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు.. మెమో నెం.48030 జారీ
* జి.ఓ.59 అమలులో అక్రమాలకు తావులేదు.. నిబంధనల ప్రకారమే నిర్ణయాలు
* గతంలో జి.ఓ.59 అమలులో జరిగిన అక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు
* ఇప్పటికే జారీ చేసిన కన్వేయన్స్ డీడ్స్ కేసులను కూడా సమగ్రంగా పరిశీలించాలి
* 22ఎ పై శరవేగంగా చర్యలు
* సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22-ఎ సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
* 22-ఎకు సంబంధించిన 10-12 సమస్యలను ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కరిస్తున్న ప్రభుత్వం
* జి.ఓ.118, జి.ఓ.76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలు జారీ
* 22-ఎలో ఉన్న GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి
* దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
* నాలా ప్రక్రియ పూర్తి కాని పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు పరిష్కారం












