National

Starlink: స్టార్‌లింక్ వెనుక అసలు గేమ్ ఇదేనా? భారత్ ఎందుకు నో చెబుతోందంటే!

రచన: Mahesh••7 నిమిషాల పఠనం

Starlink: భారతదేశ టెలికాం రంగంలోకి తన ‘స్టార్‌లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్‌కు పర్మిషన్స్ ఇవ్వకపోవటంపై ఎలాన్ మస్క్ ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానిక వ్యాపారవేత్తల గుత్తాధిపత్యం, మార్కెట్ లాబీయింగ్ వల్లే తనకు లైసెన్స్ రావడం లేదని మస్క్ ఆరోపించగా, కేంద్ర ప్రభుత్వం ఆ వాదనలను సూటిగానే తిప్పికొట్టింది.

Starlink: భారతదేశ టెలికాం రంగంలోకి తన ‘స్టార్‌లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్‌కు పర్మిషన్స్ ఇవ్వకపోవటంపై ఎలాన్ మస్క్ ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానిక వ్యాపారవేత్తల గుత్తాధిపత్యం, మార్కెట్ లాబీయింగ్ వల్లే తనకు లైసెన్స్ రావడం లేదని మస్క్ ఆరోపించగా, కేంద్ర ప్రభుత్వం ఆ వాదనలను సూటిగానే తిప్పికొట్టింది. అయితే బయటకు వినిపిస్తున్న ఈ వ్యాపార వివాదం అసలు కథలో ఒక చిన్న భాగం మాత్రమే. తెరవెనుక అసలు కారణం కోట్ల రూపాయల స్పెక్ట్రమ్ ఫీజులు కాదు.. దేశ సార్వభౌమాధికారం, అత్యంత సున్నితమైన జాతీయ భద్రత అని అంటున్నారు.

ఎలాన్ మస్క్ చేతిలో ‘కిల్ స్విచ్’

మనం రోజూ వాడే మొబైల్ నెట్‌వర్క్‌ల మాదిరిగా స్టార్‌లింక్ కేవలం భూమిపై ఉండే టవర్లపై ఆధారపడదు. భూకక్ష్యలో తిరిగే వేలాది ఉపగ్రహాల ద్వారా నేరుగా యూజర్ డిష్‌కు ఇది కనెక్ట్ అవుతుంది. వినడానికి ఇది అధునాతన విప్లవంలా అనిపించినా, దీని వెనుక దాగున్న వాస్తవం ఏమిటంటే ఈ నెట్‌వర్క్ కంట్రోల్ మొత్తం స్పేస్‌ఎక్స్ అనే ఒకే ఒక్క విదేశీ ప్రైవేట్ సంస్థ గుప్పిట్లో ఉంటుంది.

సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే స్టార్‌లింక్ చేతిలో ఒక ‘కిల్ స్విచ్’ ఉంటుంది. అంటే, అంతరిక్షం నుంచి ఏ దేశానికైనా క్షణాల్లో ఇంటర్నెట్ అందించే సామర్థ్యం ఎంత ఉందో, అంతే వేగంగా ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో సిగ్నల్స్ నిలిపివేసి సమాచార వ్యవస్థను నిర్వీర్యం చేసే శక్తి కూడా ఆ కంపెనీకి ఉంది.

ప్రపంచానికి కనువిప్పు కలిగించిన ఉక్రెయిన్ సంక్షోభం

ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఇంతటి సమాచార శక్తి ఉంటే ఎంతటి విపత్కర పరిస్థితులు తలెత్తుతాయో రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి రుచి చూపించింది. రష్యా దాడుల్లో సాంప్రదాయ కమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్పకూలినప్పుడు స్టార్‌లింక్ ఉక్రెయిన్ సైన్యానికి ప్రాణవాయువులా నిలిచింది. కానీ 2022 సెప్టెంబర్‌లో ఉక్రెయిన్ సేనలు రష్యాపై తీవ్ర ప్రతిదాడికి దిగిన కీలక సమయంలో, ఖేర్సన్ సహా పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో స్టార్‌లింక్ సేవలను మస్క్ స్వయంగా నిలిపివేశారు.

సైనిక దాడుల్లో తన సంస్థ నేరుగా భాగస్వామి కాకూడదనే ఉద్దేశంతోనే తాను నెట్‌వర్క్‌ను ఆపేశానని మస్క్ బహిరంగంగానే అంగీకరించారు. ఆ ఒక్క నిర్ణయం ఉక్రెయిన్ డ్రోన్ దాడులను, ఆర్మీ కమ్యూనికేషన్లను దారుణంగా దెబ్బతీసింది. యుద్ధ రంగంలో ఒక ప్రైవేట్ కంపెనీ అధినేత నిర్ణయం ఒక దేశ సైనిక వ్యూహాలనే తలకిందులు చేయగలదని ఈ ఘటన నిరూపించింది.

అంతర్జాతీయ వేదికపై స్పేస్‌ఎక్స్ పెత్తనం

స్పేస్‌ఎక్స్ పెత్తనం కేవలం ఉక్రెయిన్‌తోనే ఆగలేదు. సుడాన్ సంక్షోభంతో స్థానిక ప్రజలు అల్లాడుతున్న వేళ సహాయక చర్యలకు స్టార్‌లింక్ కీలకంగా మారింది. అయితే ఆకస్మికంగా రోమింగ్ పరిమితులు విధించడంతో లక్షల మంది బాధితులు సమాచార ప్రపంచానికి దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అలాగే మయన్మార్ సరిహద్దుల వెంట సైబర్ నేరగాళ్లు, స్కామ్ కేంద్రాలు వీటిని వాడుతున్నాయన్న కారణంతో వేలాది టెర్మినల్స్‌ను రిమోట్ ద్వారా క్షణాల్లో స్పేస్‌ఎక్స్ స్తంభింపజేసింది. తప్పులను అరికట్టడమే అయినప్పటికీ, నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం కేవలం కాలిఫోర్నియాలోని ఒక ఆఫీసు చేతుల్లోనే ఉందన్న చేదు నిజాన్ని ఈ ఘటనలు వెల్లడించాయి.

ఢిల్లీ పాలకుల ఆందోళన వెనుక వ్యూహం

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధాలు లేదా సైబర్ దాడులు జరిగినప్పుడు భూగర్భ ఫైబర్ కేబుల్స్ దెబ్బతింటే శాటిలైట్ ఇంటర్నెట్ తిరుగులేని ప్రత్యామ్నాయం. కానీ సంక్షోభ సమయంలో ఆ నెట్‌వర్క్‌ను ఎవరైనా రిమోట్‌గా నిలిపివేస్తే ఆ ముప్పును ఏ దేశం భరించలేదు.

భారత్‌కు పటిష్టమైన టెలికాం వ్యవస్థ, స్పష్టమైన నియంత్రణ చట్టాలు ఉన్నాయి. కేవలం స్పీడ్ బాగుందనో, సరిహద్దు ప్రాంతాల్లో కనెక్టివిటీ వస్తుందనో గుడ్డిగా తలుపులు తెరిస్తే, దేశ కీలక సమాచార తాళంచెవులను విదేశీ కార్పొరేట్ దిగ్గజానికి అప్పగించినట్లే అవుతుంది. అందుకే, స్పెక్ట్రమ్ కేటాయింపులకు ముందు డేటా ఎక్కడ భద్రపరుస్తారు, నియంత్రణ హక్కులు ఎవరి చేతుల్లో ఉంటాయి అనే నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం ఎక్కడా రాజీ పడటం లేదని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.

#Starlink#SpaceX#Elon Musk#Starlink India#Starlink India Approval#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి