హైదరాబాద్ నగరవాసులకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో సులభతర ప్రయాణం కోసం అక్టోబర్ 2న ప్రారంభించిన ‘ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్’ ధరలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రోజువారీ పాస్ ధర రూ.400, నెలవారీ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించడంతో ఇవి సగటు ప్రయాణికుడికి తీవ్ర ఆర్థిక భారంగా మారాయి. ఫలితంగా ప్రారంభమైన మొదటి వారంలో కేవలం 2నెలవారీ పాస్‌లు, 34 డైలీ పాస్‌లు మాత్రమే అమ్ముడయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మెట్రోలో గరిష్ట టికెట్ ఛార్జీ రోజుకు అప్ అండ్ డౌన్ రూ.150చొప్పున నెలకు రూ.3,750, ఆర్టీసీ డీలక్స్ పాస్ రూ.1,800 కలిపినా మొత్తం ఖర్చు రూ.5,550 దాటదు. అయితే కామన్ పాస్ ధరను ఏకంగా రూ.8,500గా నిర్ణయించడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఆర్టీసీకి రూ.1,500 మాత్రమే దక్కుతుండగా, మిగతా రూ.7,000 మెట్రోకే కేటాయించడం వివాదాస్పదమైంది.
సొంత ద్విచక్ర వాహనాలపై వెళ్లినా పెట్రోల్ ఖర్చు ఇంతకాదని, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు ఎలాంటి రాయితీలు ఇవ్వకపోవడం విక్రయాలు పడిపోవడానికి ప్రధాన కారణమైంది. ప్రజాదరణ లేకపోవడం, విక్రయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం కామన్ పాస్ ధరలపై పునరాలోచనలో పడింది.
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ నివారణకు ప్రజారవాణాను ప్రోత్సహించాలంటే ధరలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. నెలవారీ కామన్ పాస్ ధరను రూ.5,000 రేంజ్‌లోకి తగ్గిస్తే నగరవాసులకు ఎంతో ఊరట కలుగుతుందని రవాణా రంగ నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.












