Tollywood: బాహుబలి(Bahubali) సినిమా మనకి ఎంతగా పేరు తెచ్చిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు మన తెలుగు సినిమా చాలా చిన్నది..మీడియం బడ్జెట్ సినిమా అని కామెంట్స్ చేసేవాళ్ళు. ముఖ్యంగా, బాలీవుడ్ మేకర్స్‌లో మన తెలుగు సినిమా అంటే ఓ చిన్న చూపు..చులకన భావం ఉండేవి. వాటన్నిటిని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి(SS.Rajamouli) తొక్కిపెట్టేశాడు. ప్రభాస్,(Prabhas) రానా,(Rana) అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ లాంటి అగ్ర తారాగణంతో తీసిన బాహుబలి సినిమా మన తెలుగు సినిమా సత్తాను చూపించింది.
ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలోనూ ఎంతో గర్వంగా మన బాహుబలి సినిమాను..అది తీసిన రాజమౌళిని..ఇందులో నటించిన స్టార్స్‌ను..టెక్నీషియన్స్‌ను పొగడ్తలతో ముంచేశారు. అప్పటి నుంచి అందరి చూపు మన టాలీవుడ్ సినిమాలపైనే పడింది. ఇక, అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంఛైజీస్ వచ్చాక..తెలుగు నుంచి ఏ సినిమా వస్తుందో అని బాలీవుడ్ మేకర్స్ ఎదురుచూడటం మొదలు పెట్టారు.
ఇదంతా బాగానే ఉంది. కానీ, మన హీరోలు పాన్ ఇండియా సినిమా మోజులో పడి చిన్న బడ్జెట్ సినిమాలను చేయడం మానేశారు. దీంతో, 70 నుంచి 100 కోట్ల లోపు సినిమా చేయాలన్న నిర్మాతలకి మిడ్ రేంజ్ హీరోలు..కొత్త వాళ్ళనే ఎంచుకోవాల్సి వస్తోంది. ప్రతీ బిగ్ స్టార్ ఒక భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత ఒక మిడ్ రేంజ్ బడ్జెట్ సినిమా చేస్తే అందరికీ మేలు జరుగుతుంది. ఎక్కువ సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది.
మరీ, ముఖ్యంగా మేకింగ్ సమయం తగ్గిపోతుంది. బాహుబలి చేసిన ప్రభాస్ మిర్చి లాంటి కమర్షియల్ సినిమా చేసి హిట్ కొట్టాడు. ఈ సినిమాతో మంచి లాభాలు వచ్చాయి. సినిమా తయారవడానికి ఏళ్ళ సమయం పట్టలేదు. కాబట్టి, ఫ్యామిలీ కథ, మాస్ అండ్ యాక్షన్ కథ..ఏదైనా సరే ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్, తారక్ లాంటి పాన్ ఇండియా స్కేల్ మీద ఉన్న హీరోలు మీడియం బడ్జెట్ సినిమా చేస్తే బాక్సాఫీస్ వద్ద వచ్చే కలెక్షన్స్ కూడా బావుంటాయనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి, ఈ మార్పు వస్తుందా లేదా చూడాలి.












