హస్తినలో టెన్షన్ టెన్షన్
సీజేపీ నిరసనల పిలుపుతో పోలీసుల అలర్ట్
మెట్రో స్టేషన్లు క్లోజ్.. రైళ్లు బంద్
అసలు.. సీజేపీ వ్యూహమేంటి..?
దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతోంది..? ఒకవైపు నిరసనల పిలుపు.. మరోవైపు భారీ భద్రతా ఏర్పాట్లు.. ఇంకోవైపు మెట్రో స్టేషన్ల మూసివేత.. రైళ్ల రద్దు. ఇవన్నీ చూస్తుంటే రేపటి పరిణామాలపై అధికార యంత్రాంగం ఎంత అప్రమత్తంగా ఉందో అర్థమవుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునివ్వడంతో ఢిల్లీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.
57 మెట్రో స్టేషన్ల వద్ద ఆంక్షలు
ఢిల్లీ పోలీసుల తాజా ప్రతిపాదన ప్రకారం.. అక్టోబర్ 9 రాత్రి 9 గంటల నుంచి 57 మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలను మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించింది. నిరసనల సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటం, సున్నితమైన ప్రాంతాల వైపు జనసమూహాలు వెళ్లకుండా నియంత్రించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. స్టేషన్లలో రైళ్ల రాకపోకలను కూడా తగ్గించాలని సూచించారు.
ఈ జాబితాలో జనపథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్, న్యూఢిల్లీ, మండీ హౌస్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఖాన్ మార్కెట్, సుప్రీంకోర్టు, కాశ్మీరీ గేట్, ఐఎన్‌ఏ, హౌజ్ ఖాస్, లజ్‌పత్ నగర్ వంటి కీలక స్టేషన్లు ఉన్నాయి. అంటే ప్రభావం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ఢిల్లీలోని పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశముంది.
జంతర్ మంతర్ వద్ద ఏం జరగబోతోంది?
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (CJP), ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అక్టోబర్ 10న నిరసనకు పిలుపునిచ్చాయి. ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కొనసాగుతున్న వివాదం ఈ ఆందోళనకు ప్రధాన కారణం. అయితే, ఈ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో టెన్షన్ నెలకొంది.
పోలీసుల అంచనాల ప్రకారం ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో నిరసనకారులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, సెంట్రల్ ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.
23 వేల మంది కేంద్ర బలగాలు.. ఢిల్లీకి భారీ భద్రత!
నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు సహకరించేందుకు అక్టోబర్ 8 నుంచి 12 వరకు సుమారు 23 వేల మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. ఇందులో మహిళా సిబ్బందితో కూడిన 5 పారామిలటరీ కంపెనీలు కూడా ఉన్నట్లు సమాచారం. నిరసనకారులు సున్నిత ప్రాంతాలకు చేరకుండా చూడటం, శాంతిభద్రతలను కాపాడటం, ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడం అధికారుల ముందున్న ప్రధాన సవాళ్లు.
అంటే, ఇది కేవలం ఒక నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లకే పరిమితం కావడం లేదు. ప్రజా రవాణా, రహదారులు, రైల్వే స్టేషన్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
మెట్రోనే కాదు.. రైళ్ల రద్దుతో ప్రయాణికులకు ఇబ్బందులు!
ఢిల్లీ మెట్రోతో పాటు రైల్వే ప్రయాణాలపైనా నిరసనల ప్రభావం కనిపిస్తోంది. అక్టోబర్ 10న ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు చేరుకోవాల్సిన కొన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
ఇటీవల ఢిల్లీలో నిరసనల కారణంగా రోడ్లపై ఆంక్షలు విధించడంతో సుమారు 5 వేల మంది ప్రయాణికులు రైళ్లను అందుకోలేకపోయినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీలో ఈ స్థాయి ఉత్కంఠ ఎందుకు?
ఒకవైపు ఎన్నికల సంఘం పనితీరుపై నిరసన.. మరోవైపు నిరసనకు అనుమతి నిరాకరణ.. ఇంకోవైపు భారీ భద్రతా బలగాల మోహరింపు. వీటికి తోడు మెట్రో, రైల్వే సేవలపై ఆంక్షలు ప్రజల్లో ఆసక్తితో పాటు ఆందోళనను కూడా పెంచుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎంత ముఖ్యమో, ప్రజా భద్రతను కాపాడటం కూడా అంతే కీలకం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అధికారులకు సవాలుగా మారింది.
అక్టోబర్ 10న నిరసనకారులు ఎలా స్పందిస్తారు? పోలీసుల భద్రతా ఏర్పాట్లు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? ప్రజా రవాణాపై ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఈ ప్రశ్నల నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ వైపే ఉంది.












