మహారాష్ట్రలో స్కూల్ బస్ ఫీజుల చెల్లింపులకు సంబంధించి అక్టోబర్ 15 నుంచి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన డిజిటల్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు అమల్లోకి రానున్న నేపథ్యంలో, యూపీఐ (UPI) ద్వారా ఫీజుల స్వీకరణను నిలిపివేయాలని స్కూల్ బస్ ఓనర్స్ అసోసియేషన్ (SBOA) నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూల్ బస్ ఆపరేటర్లకు అధికారిక సర్క్యులర్ జారీ చేసింది.
సాధారణంగా విద్యార్థుల ఆరు నెలల బస్ ఫీజు రూ.2వేల కంటే ఎక్కువగానే ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం రూ.2వేలు పైబడిన యూపీఐ లావాదేవీలపై పేమెంట్ గేట్‌వేలు రూ.200వరకు అదనపు ఎంఆర్‌డీ ఛార్జీలు విధిస్తుండటంతో అది తమకు తీవ్ర ఆర్థిక భారంగా మారుతుందని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా సులువుగా చెల్లింపులు జరిపిన తల్లిదండ్రులు, ఇకపై ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుందని వెల్లడించింది.
యూపీఐ సేవలు నిలిచిపోనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు నగదు (Cash), చెక్కు (Cheque) లేదా క్రెడిట్ కార్డ్‌ల ద్వారా మాత్రమే స్కూల్ బస్ ఫీజులు చెల్లించాలని అసోసియేషన్ సూచించింది. అంతేకాకుండా తమ వద్ద పెట్రోల్ బంకులు, వాహన విడిభాగాల వ్యాపారులు కూడా యూపీఐ స్వీకరణను నిరాకరిస్తున్నారని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బస్ ఆపరేటర్లు వివరించారు.
ఈ అదనపు MDR ఛార్జీల నుంచి స్కూల్ బస్సులను, అనుబంధ సేవలను అత్యవసర రవాణా రంగాలుగా పరిగణించి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎస్బీఓఏ అధ్యక్షుడు అనిల్ గార్గ్ కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. ఒకవేళ కేంద్రం నుంచి ఎలాంటి మినహాయింపు లభించకపోతే యూపీఐ చెల్లింపుల రద్దును శాశ్వతం చేస్తామని హెచ్చరించారు. మహారాష్ట్రలో మొదలైన ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకూ విస్తరించే అవకాశం ఉందని రవాణా వర్గాలు భావిస్తున్నాయి.












