సిద్ధిపేట జిల్లాగా ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకోనున్న తరుణంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్థానికంగా ఏర్పాటు చేసిన 10కే రన్‌లో పాల్గొన్నారు.అంతకుముందు ‘పదేళ్ల సిద్దిపేట జిల్లా పండుగ’ వేడుకలను ఘనంగా ప్రారంభించారు.సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి 10K రన్‌ను జెండా ఊపి ప్రారంభించగా.. భారీ సంఖ్యలో పాల్గొన్న యువత, క్రీడాకారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జిల్లా ‘దశాబ్ది పండుగ’ సంబురాలు వైభవంగా సాగుతాయని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30-40 ఏళ్ల నాటి ఎన్నికల నినాదం, సిద్దిపేటను జిల్లా చేయాలనే గోడ రాతల కలను కేసీఆర్ నిజం చేశారు. 2016 అక్టోబర్ 11న సిద్దిపేట జిల్లాగా ఏర్పడగా.. 2026 అక్టోబర్ 11తో పదేళ్లు నిండుతున్నాయి. 1983లో ఎన్టీఆర్‌కు అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం ఇచ్చిన కేసీఆర్.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అదే చేతితో సంతకం చేసి జిల్లాను ప్రసాదించారు.
యూనివర్సిటీయే ప్రధాన లక్ష్యం..
‘సిద్దిపేట జిల్లా, రైలు మార్గం, గోదావరి జలాలు అనే మూడు దశాబ్దాల చిరకాల ఆకాంక్షలు ప్రజల కళ్లముందే నిజమయ్యాయి.ఇప్పటికే విద్యా నిలయంగా మారిన సిద్దిపేటకు రాబోయే రోజుల్లో యూనివర్సిటీని తీసుకురావడమే మన తదుపరి ప్రధాన లక్ష్యం.ఈ పదేళ్లు నిండుతున్న పండుగలో మీరందరూ ఈ 10K రన్‌లో పాల్గొనడానికి రావడం చాలా సంతోషం.
ఉదయాన్నే సూర్యుడు చీకటిని చీల్చుకుని ఎలా వస్తాడో.. ఈ దశాబ్దాల కాలం పాటు కలగా ఉన్న సిద్దిపేట జిల్లా కూడా ఆ సూర్యుడు చీకటిని చీల్చుకుని వచ్చినట్టుగా ఆవిర్భవించింది.ఈ జిల్లా అభివృద్ధిలో అద్భుతంగా ప్రయాణించింది.మీ అందరికీ తెలుసు.. ఇన్ని స్పోర్ట్స్ క్లబ్స్ వచ్చాయంటే, ఇంత గొప్ప క్రీడా మైదానాలు ఇక్కడ ఏర్పడ్డాయంటే, ఇన్ని జిల్లా కార్యాలయాలు ఇక్కడ వచ్చాయంటే, సిద్దిపేట ఇంత వేగంగా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం జిల్లా ఏర్పడడం వల్లే సాధ్యమైంది.ముఖ్యంగా మంచిర్యాల జిల్లా, సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా ఇలా ప్రజలకు ఎన్నో కోరికలు ఉండేవి.
రేపటి భవిష్యత్ కోసం కష్టపడాలి
ఆ 33 జిల్లాల కలను నిజం చేసి, 33 అభివృద్ధి కేంద్రాలను తీర్చిదిద్దిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది.జిల్లా ఏర్పడకముందు సిద్దిపేట ఎట్లా ఉండేది? జిల్లా ఏర్పడ్డ తర్వాత సిద్దిపేట ఎట్లా మారింది? రేపటి సిద్దిపేట ఎలా ఉండాలో కల కనాలి.. ఆ కలను నిజం చేసుకోవడం కోసం మనమందరం కలిసి కృషి చేయాలి.ఏదైనా ఆకాంక్ష లేకపోతే దానికి ఒక రూపం ఉండదు.ఈ పట్టణాన్ని, ఈ జిల్లాను రిజర్వాయర్లకు, ఆలయాలకు నిలయంగా మార్చుకున్నాం. ఒకప్పుడు మనకు మూడు నినాదాలు ఉండేవి.. సిద్దిపేట జిల్లా కావాలి, సిద్దిపేటకు రైలు రావాలి, సిద్దిపేటకు గోదావరి జలాలు రావాలి. ఈ మూడు కూడా ఇవాళ కళ్లముందు నిజమైనాయి కదా!కళ్లముందు రంగనాయక సాగర్‌లో గోదావరి జలాలు కనబడుతున్నాయి.
ఇటు నర్సాపూర్ వైపు చూస్తే పొద్దున్నే చుక్ చుక్ రైలు కనబడుతుంది.ఇటు సిద్దిపేట జిల్లా ఏర్పడి కలెక్టర్, సీపీ, జిల్లా కార్యాలయాలతో అద్భుతమైన సిద్దిపేటను మనం ఆవిష్కరించుకోగలిగాం. మరి రేపటి సిద్దిపేట ఎలా ఉండాలి?సిద్దిపేట ఇప్పటికే విద్యాలయాలకు నిలయంగా మారింది. మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, పారామెడికల్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, బీ-ఫార్మసీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్, మేనేజ్‌మెంట్ కాలేజ్.. ఇట్లా ఎన్నెన్నో కాలేజీలు తెచ్చుకున్నాం.
రేపటి సిద్దిపేటలో ఒక యూనివర్సిటీ రావాలి.ఇదొక్కటే ఇక మనకు తక్కువ ఉన్నది.ఆ యూనివర్సిటీని కూడా తప్పకుండా సాధించుకుందాం.ఆ దిశగా మనం అడుగులు వేద్దాం, ఆ దిశగా ప్రయాణిద్దాం, ఆ దిశగా మన పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును ఆవిష్కరించుకుందాం’ అని పేర్కొన్నారు. కాగా, ఉదయం 11 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించే విద్యార్థి-యువజన సదస్సులో మాజీ మంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు.












