కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన పోక్సో (POCSO) కేసుకు సంబంధించిన ఎలాంటి కంటెంట్‌ను, వార్తలను టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా వేదికల్లో ప్రసారం చేయవద్దని న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ ధర్మాసనం గురువారం సంచలన తీర్పునిచ్చింది.
సదరు కేసులో తనకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరైనప్పటికీ, కొన్ని టీవీ ఛానెళ్లు, ప్రైవేట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నిరంతరం ఈ అంశాన్ని ప్రసారం చేస్తూ మీడియా ట్రయల్ నిర్వహిస్తున్నాయని భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. భగీరథ్ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి, ఏఐ (AI) కంటెంట్‌ను సృష్టించి పోక్సో కేసుతో ముడిపెడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
వాదనలు పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. సదరు కేసుకు సంబంధించి అభ్యంతరకర కంటెంట్‌ను తక్షణమే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని గూగుల్, మెటా, ఎక్స్ (X) వంటి సోషల్ మీడియా దిగ్గజాలను ఆదేశించింది. అంతేకాకుండా భవిష్యత్తు దర్యాప్తు నిమిత్తం డిజిటల్ ఆధారాలు, మెటాడేటా, ఐపీ అడ్రస్‌లను భద్రపరచాలని సూచించింది. ఈ కేసులో ఎలాంటి కొత్త ప్రసారాలు చేయకూడదని మీడియా సంస్థలను కచ్చితంగా ఆదేశించింది.
ఈ వ్యవహారంపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర సమాచార ప్రసారాల శాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీతో పాటు ప్రధాన సోషల్ మీడియా సంస్థలు, పలువురు ప్రైవేట్ వ్యక్తులకు హైకోర్టు అధికారిక నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.












