టాప్ న్యూస్

TG : ‘సీఈసీ’ మెడపై వేలాడుతున్న కత్తి .. కాంగ్రెస్, సీజీపీకి తోడుగా బీఆర్ఎస్!

రచన: Kumar•••10 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా ‘ఎస్ఐఆర్’ ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను కాపాడుతూ.. ఇతర పార్టీల అనుకూల (అర్హుల) ఓట్లు తొలగిస్తున్నారని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది.

దేశవ్యాప్తంగా ‘ఎస్ఐఆర్’ ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను కాపాడుతూ.. ఇతర పార్టీల అనుకూల (అర్హుల) ఓట్లు తొలగిస్తున్నారని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది. ఇండియా కూటమిలోని పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్.. ఈసీ సాయంతో ‘ఓట్ చోరీ’కి పాల్పడుతున్నదని ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆయన ఎస్ఐఆర్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మిగతా ఎన్నికల కమిషనర్లు విభేదించారని ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. సీఈసీ కేంద్రానికి అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అందుకే ఫారమ్-6, ఫారమ్-7 ద్వారా చిన్న చిన్న పేర్లలోని తప్పిదాలకు నోటీసులు ఇస్తూ ఓట్లు తొలగిస్తున్నారని సాధారణ ఓటర్ల నుంచి సైతం విమర్శలొస్తున్నాయి. అంతేకాకుండా నోటీసుల పేరిట సాధారణ ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్..

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన మీద వచ్చిన ఆరోపణలకు ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. దానిని ఖండించే ప్రయత్నమూ చేయలేదు. ఈ విషయంలో తెలంగాణ స్టేట్ సీఈవో సుదర్శన్ రెడ్డి మాత్రమే స్పందించారు. ఫారమ్ -6 విషయంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు అవాస్తమని..ఫ్యాక్ట్‌చెక్ ద్వారా తేల్చారు. కాగా, కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓటు చోరీ విషయంలో స్పందించాలని దేశంలోని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల సంఘం స్వతంత్రత మీద ఆరోపణలు వచ్చినప్పుడు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత సీఈసీ మీద ఉంటుందని జాతీయ, ప్రాంతీయ ప్రధాన పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన మౌనమే తప్పుకు అంగీకారమని భావిస్తూ రాజీనామాకు పట్టుడుతున్నాయి.

తగ్గని రాహుల్ గాంధీ..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఓట్ చోరీకి పాల్పడుతున్నారని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనుకూల ఓట్లు తొలగిస్తున్నారని ఆయన ముందు నుంచి ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే రెండ్రోజుల కింద ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీలతో కలిసి పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో పోలీసులు రాహుల్ సహా ప్రియాంకగాంధీతో పాటు పలువురు ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేశారు.తన మీద వంద ఎఫ్ఐఆర్‌లు నమోదైనా సీఈసీ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేదిలేదని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.

సీజేపీ దూకుడు..

మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ సైతం సీఈసీ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ చోరీకి పాల్పడుతోందని, జ్ఞానేశ్ కుమార్ రాకముందు తక్కువగా ఉన్న బీజేపీ ఓటు షేర్.. ఆయన వచ్చాక పెరిగిందని ఆధారాలతో సహా చూపిస్తూ విమర్శలు గుప్పిస్తోంది. ఆయన ఎన్నికల సంఘం స్వతంత్రతను దెబ్బతీస్తున్నారని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో జెన్ జీతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టి సీఈసీ రాజీనామాకు డిమాండ్ చేశారు. రేపు జంతర్ మంతర్ వేదికగా మరోసారి నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఈసారి ఢిల్లీ ప్రజలు, యువత పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల కోసం ఎన్నికల సంఘంలో పారదర్శకత కోసం ఈ పోరాటం కీలకమని నిన్న వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ నిరసనల్లో సీజేపీ ప్రతినిధులు, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సహా పలువురు పాల్గొననున్నారు.

రాజీనామాకు హరీశ్ రావు, కేటీఆర్ పట్టు..

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన వెన్నెముక లాంటిదని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలో ఉన్నవారికి కవచంగా మారకూడదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈసీ నియామకాలు, దాని స్వతంత్రత, పనితీరుపై వస్తున్న ప్రశ్నలు మన రాజ్యాంగ ప్రజాస్వామ్య మూలాలనే తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 324, 325, 326తో పాటు 1950, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాలు నిష్పక్షపాతమైన, నమ్మదగిన ఎన్నికల వ్యవస్థను కోరుతున్నాయని హరీశ్ రావు గుర్తుచేశారు. ఏ ఒక్క అర్హులైన ఓటరుకు కూడా వారి ఓటు హక్కును ఏకపక్షంగా నిరాకరించడానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల సంఘంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని, ఈసీ పట్ల విశ్వాసాన్ని నిలబెట్టలేకపోతే ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాలని, ఈ వైఫల్యానికి ఆయన పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగం కంటే ఒక వ్యక్తి గొప్పవాడు కాదని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ డిమాండ్ చేశారు.ఒక వ్యక్తిని కాపాడేందుకు ఎందుకు ఇంత ప్రయత్నిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. SIR ప్రక్రియలో అక్రమాలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

సీఈసీ, ఈసీల నియామకాలపై సుప్రీంలో పిల్

సీఈసీ జ్ఞానేష్ కుమార్, ఇతర ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిల నియామకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం నాడు రిట్ పిటిషన్ దాఖలైంది. 2023 నాటి సీఈసీ, ఇతర ఈసీల నియామకాలు చట్టవిరుద్ధంగా జరిగాయని ఆరోపిస్తూ సూరి పాయల అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. రూల్స్ ప్రకారం ప్రతీ ఒక ఖాళీకి ఐదుగురి పేర్లతో కూడిన జాబితాను సెర్చ్ కమిటీ సిద్ధం చేయాల్సి ఉండగా, 2024 మార్చిలో 2 ఖాళీలకు కేవలం ఆరుగురి పేర్లను మాత్రమే సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ,అందులో అనుభవం ఉన్న వ్యక్తులనే నియమించాల్సి ఉండగా, ఈ ముగ్గురికి ఎలాంటి ఎన్నికల నిర్వహణ అనుభవం లేదని అధికారిక రికార్డులు చెబుతున్నాయని ఆరోపించారు. వీరి నియామకాలకు సంబంధించిన ఒరిజినల్ రికార్డులను కోర్టుకు సమర్పించేలా ఆదేశించాలని ‘రిట్’ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈసీ ప్రతిష్టను దెబ్బతీయొద్దు

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో పాటు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) లక్ష్యంగా విపక్షాలు చేపడుతున్న ఆందోళనలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై వస్తున్న ఆరోపణలపై 42 మంది మాజీ న్యాయమూర్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈసీ ప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతున్న ప్రయత్నాలను, ఎస్ఐఆర్ ప్రక్రియపై వస్తున్న విమర్శలను వారు తీవ్రంగా తప్పుపట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ‘ఓట్ల చోరీ’ అని రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై దాడులకు దిగడం ప్రజాస్వామ్య విశ్వసనీయతను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తూ గురువారం ఒక ఉమ్మడి బహిరంగ లేఖను విడుదల చేశారు.

#CEC gnanesh kumar#BRS#Congress#CJP#KTR#Harishrao#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి