National

దేశంలోనే అధిక ఓట్లకోత.. బీజేపీ తెలంగాణను టార్గెట్ చేసిందా?

రచన: Mamatha puppala••6 నిమిషాల పఠనం

తెలంగాణలో చేపట్టిన ముందస్తు ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (SIR) ప్రక్రియ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఈ సమగ్ర సవరణ ద్వారా దాదాపు 95 లక్షల ఓట్లను (27.8 శాతం) ఎన్నికల సంఘం తొలగించినట్లు సమాచారం అందుతోంది.

తెలంగాణలో చేపట్టిన ముందస్తు ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (SIR) ప్రక్రియ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఈ సమగ్ర సవరణ ద్వారా దాదాపు 95 లక్షల ఓట్లను (27.8 శాతం) ఎన్నికల సంఘం తొలగించినట్లు సమాచారం అందుతోంది. సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు తెలంగాణలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, పరిశీలన ముగిసేసరికి ఈ సంఖ్య కేవలం 2.43 కోట్లకు పడిపోనుంది. విదేశాల్లో నివసించే భారతీయుల (NRI) ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే మరో 6,270 మంది ఓటర్లు పెరిగే అవకాశం ఉంది. అయితే, తొలగింపుల శాతం దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉండటం చర్చకు దారితీస్తోంది.

 హైదరాబాద్‌ పరిధిలోనే ఏకంగా 43లక్షల ఓట్ల కోత

ఈ సవరణ ప్రక్రియలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే ఓట్ల తొలగింపులు జరిగాయి. కేవలం హైదరాబాద్ పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనే ఏకంగా 43లక్షల ఓట్లను తొలగింపు జాబితాలో చేర్చడం గమనార్హం. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలలో శేరిలింగంపల్లి నియోజకవర్గం 3,29,828 ఓట్ల తొలగింపుతో అగ్రస్థానంలో నిలిచింది. దాని తర్వాతి స్థానాల్లో కుత్బుల్లాపూర్ (2,76,924), ఎల్బీనగర్ (2,70,284), రాజేంద్రనగర్ (2,47,005), మహేశ్వరం (2,35,331), ఉప్పల్ (2,18,323) ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 25 నియోజకవర్గాల్లో లక్షకు పైగా ఓట్లను తొలగించారు.

 ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే గరిష్ఠం

దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణలోనే అత్యధిక శాతంలో ఓట్ల కోత విధించారు. మహారాష్ట్రలో 2.07 కోట్లు (21.1శాతం), కర్ణాటకలో 1.06 కోట్లు (19.5శాతం), ఉత్తరప్రదేశ్‌లో 2.04 కోట్లు (13.21శాతం), గుజరాత్‌లో 68.1 లక్షలు (13.4శాతం), తమిళనాడులో 74 లక్షలు (11.5శాతం), ఆంధ్రప్రదేశ్‌లో 44.7 లక్షలు (10.8శాతం), బీహార్‌లో 47 లక్షలు (6శాతం) చొప్పున ఓట్లు తొలగించారు. పొలిటికల్ హీట్ పెంచిన పశ్చిమ బెంగాల్‌లో కేవలం 88.9 లక్షల (11.6శాతం) ఓట్లను మాత్రమే తొలగించగా, తెలంగాణలో మాత్రం ఏకంగా 27.8 శాతం ఓట్లు తుడిచిపెట్టుకుపోవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 రాజకీయంగా రగులుతున్న వివాదం

రాష్ట్రంలో భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు నమోదు కావడంతో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఒక దశలో బీజేపీ తెలంగాణను టార్గెట్ చేస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ల జాబితా శుద్ధి పేరుతో అసలైన ఓటర్ల హక్కులను కాలరాస్తున్నారని, తమకు అనుకూలంగా మార్చుకునేందుకే బీజేపీ ఈ రకమైన కుట్రలకు పాల్పడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, మృతుల పేర్లు, చిరునామాలు మారిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డ్యూప్లికేట్ ఓట్లను మాత్రమే నిబంధనల ప్రకారమే తొలగించామని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేస్తున్నారు.

 నవంబర్ 9న ప్రచురణ కానున్న తుది జాబితా

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన నియోజకవర్గాలైన మేడ్చల్ (2,13,122), మల్కాజిగిరి (1,92,957), జూబ్లీహిల్స్ (1,79,510), కూకట్‌పల్లి (1,70,240), యాకుత్‌పురా (1,54,982), చాంద్రాయణగుట్ట (1,48,869), మలక్‌పేట్ (1,47,799), ఖైరతాబాద్ (1,41,766)లలో లక్షకు పైగా ఓట్లు గల్లంతవడం గమనార్హం. ప్రస్తుతం ఈ తొలగింపులపై క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన తుది దశకు చేరుకుంది. అన్ని పరిశీలనలు ముగించుకుని నవంబర్ 9న అధికారికంగా ప్రచురించనున్న తుది ఓటర్ల జాబితాపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

#TelanganaVoterList#SIRTelangana#ElectionCommission#VoterDeletion#HyderabadVoters#TelanganaPolitics#ElectionRolls2026
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి