తెలంగాణలో అక్టోబర్ నెల వచ్చినా ఎండల తీవ్రత తగ్గడం లేదు. ఉదయం నుండే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సాధారణంగా దసరా సమయానికి వాతావరణం చల్లబడి శీతాకాలపు గాలులు ప్రారంభం కావాలి. కానీ ఈసారి రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. అసాధారణ ఉష్ణోగ్రతలకు తోడు గాలిలో తేమ శాతం పెరగడంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.
ఈ క్రమంలో శీతాకాలంలోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణుల అంచనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ఈశాన్య రుతుపవనాల ద్వారా తెలంగాణలో అక్టోబర్, నవంబర్ నెలల్లో పెద్దగా వర్షాలు పడే అవకాశం లేదని, బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనాలు ఏర్పడితే తప్ప రాష్ట్రంలో వర్ష సూచన లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు..
కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఈ అసాధారణ వాతావరణ మార్పులకు ప్రధాన కారణం... పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రరూపం దాల్చుతున్న 'ఎల్ నినో' ప్రభావమే అని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్ నినోలలో ఇది ఒకటిగా నిలిచిపోనుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది.
మానవ తప్పిదాలు, విపరీతమైన కాలుష్యం కారణంగా పసిఫిక్ మహాసముద్రం గత కొన్నేళ్లుగా తనలో నిల్వ చేసుకున్న వేడిని ఒక్కసారిగా వాతావరణంలోకి విడుదల చేస్తోందని, ఈ క్రమంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో తూర్పు, మధ్య ఉష్ణమండల పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.7 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉందని.. దీని వల్ల రాబోయే డిసెంబర్ నాటికి ఈ ఎల్ నినో గరిష్ఠ స్థాయికి చేరుకుని, ఫిబ్రవరి వరకు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు అంతర్జాతీయ వాతావరణ పరిశోధకులు ఈ పరిస్థితులపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక పసిఫిక్‌లోని 'నినో 3.4' అనే ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా కాకుండా 3.4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. గత చరిత్రలో ఏ ఎల్ నినో సమయంలోనూ ఇంతటి ఉష్ణోగ్రతలు చూడలేదని వాతావరణ శాస్త్రవేత్త జీక్ హాస్‌ఫాదర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
అలాగే ఈ అనూహ్య మార్పులను మరో నిపుణుడు లియోన్ సైమన్స్ దీనిని సూపర్ సూపర్ ఎల్ నినోగా అభివర్ణించారు. ఎల్ నినో ప్రభావంతో భూగోళం ప్రస్తుతం నిప్పులు కక్కుతూ దాదాపు ఎర్రబడిపోయిందని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్ మౌవీ స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే ఈ సూపర్ ఎల్ నినో భారత రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు..
ఇక జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలో దీర్ఘకాల సగటు వర్షపాతంతో పోలిస్తే కేవలం 87.4 శాతం మాత్రమే వర్షాలు మాత్రమే కురిశాయి. దీనివల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, బిహార్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపిన వివరాల ప్రకారం... 1871 నుంచి 155 ఏళ్ల చరిత్రలో దేశం 27 సార్లు అత్యంత తీవ్రమైన కరువును ఎదుర్కొంది. అందులో 1950 తర్వాతే 15 సార్లు కరువు సంభవించగా, 1972 మరియు 2009 లలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక 1950 తర్వాత ఇదే.. చరిత్రలో ఇదే అత్యంత బలమైన ఎల్ నినో గా చెబుతూ.. డిసెంబరు నాటికి నిప్పుల కొలిమిలా మారే అవకాశాలున్నట్టు శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోవడం, కరువు ముప్పు పెరగడం వల్ల వ్యవసాయ రంగానికి మాత్రమే కాకుండా దేశ ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు.
మరోవైపు ప్రస్తుతం నెలకొంటున్న అసాధారణ వాతావరణం వల్ల, తీవ్రమైన ఉక్కపోత దృష్ట్యా ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తప్పని సరిగా పాటించడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం శ్రేయస్కరమని వెల్లడిస్తున్నారు.
అదేవిధంగా శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలని, బయటకు వెళ్లే సమయంలో గొడుగులు, టోపీలు వాడటంతో పాటు గాలి ఆడేలా ఉండే తేలికపాటి దుస్తులు ధరించాలని పేర్కొంటున్నారు. మరోవైపు రైతులు కూడా వాతావరణ శాఖ తాజా సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తమ వ్యవసాయ పనులను ముందుకు తీసుకెళ్లడం ముఖ్యమని.. ఈ తీవ్ర ఎల్ నినో ప్రభావం తగ్గే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటమే ప్రస్తుతానికి మనముందు ఉన్న ఏకైక మార్గమని తెలియచేశారు..












