తెలంగాణ

DK Aruna: కేసులకు రైతులు భయపడరు- ఎంపీ డీకే అరుణ

రచన: NK•••5 నిమిషాల పఠనం

జూరాల నీటి విడుదల కోసం పోరాటం చేసిన రైతులు, రైతుల పక్షాన పోరాటం చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని.. ఇలాంటి బెదిరింపులకు రైతులు భయపడరని ఎంపీ డీకే అరుణ అన్నారు.

DK Aruna: జూరాల నీటి విడుదల కోసం పోరాటం చేసిన రైతులు, రైతుల పక్షాన పోరాటం చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని.. ఇలాంటి బెదిరింపులకు రైతులు భయపడరని ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రభుత్వం నీళ్లు విడుదల చేయాల్సిందే.. పంటలు కచ్చితంగా కాపాడాల్సిందే అని తేల్చి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కర్ణాటకకు వెళ్లి నీళ్ళు తెస్తామని పెద్ద డ్రామా చేశారని, వాళ్ల మాటలన్నీ పచ్చి అబద్దాలని మండిపడ్డారు.

కర్నాటక నుంచి చుక్క నీరు రాలేదు

వాయుగుండంతో కురిసిన వర్షాలకు నీరు వస్తే కర్ణాటక విడుదల చేసిన నీళ్ళని నమ్మించారని చెప్పారు. వాస్తవానికి చుక్క నీరు కర్ణాటక నుంచి రాలేదన్నారు. పంటలు ఎండిపోకుండా రెండవ తడి అవసరం ఉందని డీకే అరుణ అన్నారు. జూరాలలో నీళ్లు ఉన్నాయని, వెంటనే విడుదల చేసి పంటలు కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాటాకు చప్పుళ్లకు భయపడరు

''నాన్ బెయిలబుల్ కేసులు పెడితే.. డ్యామ్ పై రైతులు ధర్నాలు, నిరసనలు చేయకుండా.. నీళ్ళు అడగకుండా భయపడతారని అనుకున్నారేమో. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు. వెంటనే జూరాల నుంచి కుడి, ఎడమ కెనాల్స్ ద్వారా పంటలకు నీళ్ళు ఇవ్వాల్సిందే. అరెస్టులకు భయపడం.. ప్రతిపక్షంలో ఉన్నాం.. బరాబర్ రైతుల పక్షాన పోరాటం చేస్తాం. కేసులు అయినా.. రైతులెవరూ చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోరు. నీళ్ల కోసం రైతులు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు.

రైతులపై ప్రేమ ఉంటే వెంటనే కేసులు ఎత్తివేయాలి

రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర వివక్ష చూపుతోంది. రైతులకు అన్యాయం చేస్తున్నారు. పంటలు ఎండబెడుతున్నారు. రైతులకు.. రైతు బంధు లేదు.. రుణమాఫీ అందరికీ చేయలేదు. అరకొరగా పథకాలు అమలు చేసి, గొప్పలు చెప్పుకుంటున్నారు. అబద్ధాలు చెప్పి, మోసం చేస్తున్నారని ప్రజలందరికీ తెలుసు. ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. రైతులు, రైతుల పక్షాన పోరాటం చేసిన అందరిపై నమోదైన కేసులు ఎత్తివేయాలి. వెంటనే జూరాల నుంచి నీటిని విడుదల చేసి రైతులను కాపాడాలి'' అని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు డీకే అరుణ. కాగా, వనపర్తి జిల్లాలో అనుమతి లేకుండా జూరాల గేట్లు తెరిచి నీటిని విడుదల చేసిన 14మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

రైతులపై కేసులు దారుణం

వనపర్తి జిల్లాలో ఎండుతున్న పంటలకు జూరాల నీటిని విడుదల చేయాలని ఆందోళన చేసిన రైతులపై కేసుల నమోదు చేసిన అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఎండిపోతున్న పంటలు కాపాడుకోవడం కోసం నీళ్లు అడిగిన రైతులపై కేసులు నమోదు చేయడం దారుణం అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో అన్నదాతల చేతులకు బేడీలు వేయడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

#Dk Aruna#Bjp#Jurala Dam#Jurala Water#Farmers Cases#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి