National

దేశంలో ఎల్‌‌‌‌‌‌‌‌నినో ఎఫెక్ట్ షురూ.. తాగునీటి సంక్షోభం.. మహారాష్ట్రలో 10% నీటి కోత విధించిన సర్కార్

రచన: NK•••6 నిమిషాల పఠనం

ఎల్ నినో.. పెను ప్రభావమే చూపుతోంది. దేశంలో అప్పుడే నీటి ఎద్దడి మొదలైపోయింది. ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో రుతుపవనాలు ముఖం చాటేశాయి. చాలా చోట్ల వర్షాలే కురవలేదు. దీంతో తాగు నీటి సమస్య ఆందోళనకు గురి చేస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటకలో తాగునీటికి కటకట ఏర్పడబోతోంది.

* ఎల్ నినో ఎఫెక్ట్

* మహారాష్ట్రలో 10శాతం నీటి కోత విధించిన సర్కార్

* కర్నాటక, గుజరాత్‌‌‌‌‌‌‌‌లోనూ కరవు ఛాయలు

* గుజరాత్ లో సగం కూడా నిండని జలాశయాలు

* రూ.7,142 కోట్ల కరవు సాయం కోరిన కర్ణాటక

* నీటి పరిరక్షణకు ‘మహా’ సర్కారు గైడ్ లైన్స్

* రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా నీటి కొరత

El nino: ఎల్ నినో.. పెను ప్రభావమే చూపుతోంది. దేశంలో అప్పుడే నీటి ఎద్దడి మొదలైపోయింది. ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో రుతుపవనాలు ముఖం చాటేశాయి. చాలా చోట్ల వర్షాలే కురవలేదు. దీంతో తాగు నీటి సమస్య ఆందోళనకు గురి చేస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటకలో తాగునీటికి కటకట ఏర్పడబోతోంది. జలాశయాల్లో నిల్వలు అడుగంటుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16 నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 10 శాతం తాగునీటి కోత విధించనుంది.

డ్యాములు సగం కూడా నిండలేదు

కరవు ఛాయలు కమ్ముకున్నాయని, కేంద్రం రూ.7,142 కోట్ల సాయం చేయాలని కర్నాటక కోరుతోంది. గుజరాత్‌‌‌‌‌‌‌‌లో చాలావరకు డ్యాములు సగం కూడా నిండలేదు. లోటు వర్షపాతం, కరవు పరిస్థితులు తలెత్తే ముప్పును దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర సర్కారు తాగునీటిపై కీలక నిర్ణయం తీసుకుంది.

తాగునీటికే అత్యధిక ప్రాధాన్యం

ఎల్‌‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని 2027 ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై డ్యామ్‌‌ల వారీగా, రంగాల వారీగా ప్లాన్ రూపొందించామని మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రి గిరీష్ మహాజన్ తెలిపారు. "తాగునీటికే అత్యధిక ప్రాధాన్యం" అని స్పష్టం చేసిన ఆయన, కోతను అమలు చేయాలని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలను ఆదేశించారు.

గుజరాత్ లో తాగునీటి సంక్షోభం

గుజరాత్‌‌లో 206 డ్యామ్‌‌లకు గాను 109 డ్యామ్‌‌లు సెప్టెంబర్ చివరి నాటికి 50 శాతం కన్నా తక్కువ సామర్థ్యంతో ఉన్నాయి. మరో 28 డ్యామ్‌‌లు 50-70 శాతం, 37 డ్యామ్‌‌లు 70 నుంచి 100 శాతం నిండాయి. 32 డ్యామ్‌‌లు పూర్తిగా నిండాయి. రాష్ట్రంలోని అతిపెద్ద సర్దార్ సరోవర్ డ్యామ్ ఏడోసారి గరిష్ఠ మట్టం 138.68 మీటర్లకు చేరినా, కొన్ని జలాశయాలు నిండినంత మాత్రాన రాష్ట్రమంతా నీటికి లోటు లేదని చెప్పలేమని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే పరిస్థితి ఉందని అక్కడి సర్కారు అంచనా వేస్తోంది.

కరవు సాయంగా రూ.7వేల కోట్లు ఇవ్వాలని విన్నపం

కర్ణాటకలో 240 తాలూకాల్లో 217 కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించగా, వాటిలో 177ను అధికారికంగా కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారు. సీఎం డీకే శివకుమార్ కరవు సాయంగా కేంద్రం నుంచి రూ.7,142 కోట్లు కోరారు.

మళ్లీ జల్ దూత్ రైళ్లు

తాగు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు జలదూత్ తరహా వాటర్ ట్రైన్లు నడిపేందుకు సిద్ధమని సెంట్రల్ రైల్వే ప్రకటించింది. 2016లో గొంతెండిన లాతూర్‌‌‌‌‌‌‌‌కు జల్ దూత్ రైళ్లు 100కు పైగా ట్రిప్పుల్లో 24 కోట్ల లీటర్లకు పైగా తాగునీటిని చేర్చిన విషయం తెలిసిందే. అయితే రవాణా మాత్రమే తమ పని అని, నీటి వనరును రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించి ఇవ్వాలని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా స్పష్టం చేశారు.

''నీటిని మాకు అందిస్తే రవాణా చేస్తాం. వనరు వెతకడం మా పని కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక అభ్యర్థన అందలేదు. 2016లో ఒకే చోట నుంచి నీటిని తెచ్చి ఒక జిల్లాకు చేర్చాం. మహారాష్ట్రలో 70% ప్రాంతం కరవు కోరల్లో ఉంది. ఇప్పుడు జల్ దూత్ ఆపరేషన్ మరింత క్లిష్టమయ్యే అవకాశం ఉంటుంది’ అని స్వప్నిల్ తెలిపారు.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి