ఐటీ నిపుణులకు షాకుల మీద షాకులు
అమెరికా కొత్త నిబంధనలతో పరేషాన్
భారత ఐటీ దిగ్గజాల పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ రద్దు
గ్రీన్ కార్డులపైనా ప్రభావం..?
అమెరికాలో ఉద్యోగం.. అక్కడే స్థిరపడాలనే కల.. గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ఇది సర్వసాధారణం. అయితే ఇప్పుడు అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం ఈ ప్రయాణాన్ని మరింత కఠినంగా మార్చేలా కనిపిస్తోంది. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ, అడోబ్ వంటి దిగ్గజ సంస్థలను అమెరికా పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ కార్యక్రమం నుంచి సస్పెండ్ చేసింది. కొత్త దరఖాస్తులతో పాటు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా ప్రాసెస్ చేయబోమని అమెరికా కార్మికశాఖ ప్రకటించింది.
గ్రీన్‌కార్డ్‌కు కీలకమైన PERM
అమెరికాలో ఒక సంస్థ విదేశీ ఉద్యోగికి ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్ స్పాన్సర్ చేయాలంటే PERM ప్రక్రియ కీలకమైన దశ. అమెరికన్ ఉద్యోగులకు నష్టం కలగకుండా, ఆ ఉద్యోగానికి తగిన అమెరికన్ ఉద్యోగి అందుబాటులో లేడని యజమాని నిరూపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే గ్రీన్‌కార్డ్ దరఖాస్తు తదుపరి దశలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఎనిమిది కంపెనీల PERM ప్రక్రియనే అమెరికా నిలిపివేసింది. దీంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశం ఉంది.
మన ఐటీ నిపుణులకే ఎందుకు టెన్షన్?
అమెరికా టెక్ రంగంలో భారతీయ నిపుణుల సంఖ్య భారీగా ఉంది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్ వంటి సంస్థల్లో వేలాది మంది భారతీయులు అమెరికాలో పనిచేస్తున్నారు. హెచ్-1బీ అనేది అమెరికాలో పనిచేయడానికి తాత్కాలిక మార్గం కాగా, చాలామంది ఉద్యోగుల చివరి లక్ష్యం అక్కడే శాశ్వతంగా స్థిరపడటం. అందుకు గ్రీన్‌కార్డ్ కీలకం. ఇప్పుడు గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో కీలకమైన PERM దశలోనే బ్రేక్ పడటంతో ఆయా కంపెనీల ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
వీసా రద్దు కాదు.. కానీ ఎదురుచూపులు పెరగొచ్చు
PERM సస్పెన్షన్ అంటే ప్రస్తుతం ఉన్న హెచ్-1బీ వీసాలు వెంటనే రద్దు అవుతాయని కాదు. అమెరికాలో చెల్లుబాటయ్యే హెచ్-1బీ స్టేటస్‌తో పనిచేస్తున్న ఉద్యోగులు ఒక్కసారిగా దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పలేం. కానీ గ్రీన్‌కార్డ్ కోసం ముందుకు వెళ్లాల్సిన ఉద్యోగులకు మాత్రం అనిశ్చితి పెరుగుతుంది. ముఖ్యంగా హెచ్-1బీ గరిష్ఠ కాలపరిమితికి దగ్గరలో ఉన్నవారికి గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో జాప్యం మరింత ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు.
అమెరికా ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది?
ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ చర్యను అమెరికన్ ఉద్యోగాల రక్షణ కోణంలో సమర్థిస్తోంది. విదేశీ ఉద్యోగుల నియామకంలో కొన్ని కంపెనీలు నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నాయన్నది అమెరికా ప్రభుత్వ ఆరోపణ. 2009 నుంచి ఈ సంస్థలు భారీ సంఖ్యలో విదేశీ ఉద్యోగులకు సంబంధించిన లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తులు చేశాయని అధికారులు చెబుతున్నారు. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీ కార్మికులు ఆక్రమిస్తున్నారనే వాదనతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, కార్మికశాఖ అధికారులు వెల్లడించారు.
విదేశీ విద్యార్థులపైనా భారీ ఫీజు ప్రతిపాదన
ఐటీ దిగ్గజాలపై PERM సస్పెన్షన్ ప్రకటన వచ్చిన సమయంలోనే విదేశీ విద్యార్థులకు సంబంధించిన మరో కీలక ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. అమెరికాలో చదువు పూర్తిచేసిన అంతర్జాతీయ విద్యార్థులు ఉద్యోగ అనుభవం పొందేందుకు ఉపయోగించే ఓపీటీ కార్యక్రమానికి 70 వేల డాలర్ల ఫీజును ప్రతిపాదించింది ట్రంప్ ప్రభుత్వం. తదుపరి ఓపీటీ పొడిగింపుకు మరో 30 వేల డాలర్ల ఫీజు ఉండేలా ప్రతిపాదన వచ్చింది. అయితే ఇది ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది.
చదువు నుంచి ఉద్యోగం.. ఉద్యోగం నుంచి గ్రీన్‌కార్డ్
అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే భారతీయ విద్యార్థులకు సాధారణంగా చదువు పూర్తయ్యాక ఓపీటీ ద్వారా ఉద్యోగ అనుభవం పొందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత హెచ్-1బీ వీసాకు ప్రయత్నిస్తారు. హెచ్-1బీ ద్వారా ఉద్యోగం కొనసాగిస్తూ చివరకు గ్రీన్‌కార్డ్ కోసం ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఈ మొత్తం ప్రయాణంలో ఒక్కో దశలో కొత్త నిబంధనలు, కొత్త ఖర్చులు, కొత్త అనిశ్చితులు ఎదురవుతున్నాయి. అందుకే తాజా పరిణామాలు ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులతో పాటు, భవిష్యత్తులో అమెరికాలో చదువు, ఉద్యోగం చేయాలని భావిస్తున్న విద్యార్థులపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
మన ఐటీ నిపుణులకు ఇబ్బందులు తప్పవా?
ప్రస్తుతం అందరికీ వెంటనే ఇబ్బందులు వస్తాయని చెప్పలేం. PERM సస్పెన్షన్ నిర్దిష్టంగా కొన్ని కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది. హెచ్-1బీ వీసాలు మొత్తం రద్దు కాలేదు. కానీ ఈ కంపెనీల్లో పనిచేస్తూ గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో ఉన్న ఉద్యోగులకు మాత్రం ఆలస్యం, అదనపు ఖర్చులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం ఈ సస్పెన్షన్‌ను ఎంతకాలం కొనసాగిస్తుంది? దర్యాప్తుల తర్వాత కంపెనీలకు మళ్లీ PERM ప్రక్రియను అనుమతిస్తుందా? లేక మరిన్ని ఆంక్షలు వస్తాయా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
ఒకవైపు ఐటీ దిగ్గజాలపై PERM బ్రేక్.. మరోవైపు విదేశీ విద్యార్థుల ఓపీటీపై భారీ ఫీజు ప్రతిపాదన. ఈ పరిణామాలు చూస్తే అమెరికా ప్రభుత్వం విదేశీ ఉద్యోగులు, విదేశీ విద్యార్థుల విషయంలో మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకే అమెరికాలో ఉన్న మన ఐటీ నిపుణులకు ఇప్పటికిప్పుడు ఉద్యోగ భయం కంటే.. తమ గ్రీన్‌కార్డ్ భవిష్యత్తుపై ఆందోళనే పెద్ద ప్రశ్నగా మారుతోంది.












