తెలంగాణ

Telangana:రాష్ట్రంలో విద్యుత్ కోతలకు త్వరలో చెక్-రేవంత్ రెడ్డి కేబినెట్ కీలక నిర్ణయం!!

రచన: Venu••6 నిమిషాల పఠనం

2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంది. పరిశ్రమలకు పవర్ హాలిడేలు, వ్యవసాయానికి రాత్రివేళల్లో అరకొర విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఉండేది.

రాష్ట్రంలో విద్యుత్ కోతలకు శాశ్వత చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్ ఎనర్జీని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు రేవంత్ రెడ్డి మంత్రివర్గం సిద్దం అవుతుంది. ఈ క్రమంలో ఏకంగా 28 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెన్‌కో ఆధ్వర్యంలో ఈ భారీ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ తో సవాళ్లు

ఒక్కసారి గత సంఘటనలను పరిశీలిస్తే... 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణ తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంది. పరిశ్రమలకు పవర్ హాలిడేలు, వ్యవసాయానికి రాత్రివేళల్లో అరకొర విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఉండేది. ఆ తర్వాత విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసి నిరంతర విద్యుత్ అందిస్తున్నప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో ప్రభావం, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వేగంగా పెరుగుతున్న పారిశ్రామిక వినియోగం వల్ల ఈ వేసవిలో డిమాండ్ ఏకంగా 15 వేల మెగావాట్లను దాటిపోయింది.

ముఖ్యంగా డిస్కంలకు ఉదయం 6 నుంచి 10, రాత్రి 6 నుంచి 10 గంటల మధ్య పీక్ అవర్స్‌లో డిమాండ్‌కు తగ్గట్టు కరెంట్ ఇవ్వడం పెద్ద సవాలుగా మారింది. మరోవైపు డిమాండ్ సరిపోక బయటి మార్కెట్ నుంచి యూనిట్‌కు రూ.3 అదనంగా వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రతి ఏటా డిస్కంలపై వేల కోట్ల రూపాయలదనపు భారం పడుతోంది.

సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు

రానున్న రోజుల్లో విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టేలా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అని భావింస్తుంది. ఇక సోలార్, విండ్ పవర్ పగటిపూట మాత్రమే ఉత్పత్తి అవుతాయి. పగటిపూట అదనంగా వచ్చే సోలార్ కరెంట్‌ను గ్రిడ్‌కు ఉచితంగా ఇవ్వకుండా, అత్యాధునిక లిథియం-అయాన్, ఫ్లో బ్యాటరీలలో స్టోర్ చేసి చీకటి పడ్డాక, పీక్ అవర్స్‌లో బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఈ కరెంట్‌ను గ్రిడ్‌కు సరఫరా చేస్తారు..

ఇప్పటికే రాష్ట్రంలో ఈ విధానం పైలట్ ప్రాజెక్టులుగా విజయం సాధించింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్,రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సబ్‌స్టేషన్ల వద్ద 187.5 మెగావాట్ల చొప్పున... మొత్తం 375 మెగావాట్ల బ్యాటరీ నిల్వ వ్యవస్థను గ్రిడ్‌కు అనుసంధానించారు. మరోవైపు, మందమర్రిలో సింగరేణి సంస్థ 2.73 కోట్ల ఖర్చుతో 1 మెగావాట్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి, పీక్ టైమ్‌లో వాడుకోవడం ద్వారా ఏడాదికి రూ.70 లక్షలు ఆదా చేస్తోంది. విజయవంతమైన ఈ ప్రాణాళికతో మరో 250 మెగావాట్ల ప్లాంట్లకు సింగరేణి ఏరియాల్లో సన్నాహాలు చేస్తున్నారు.

కరెంట్ కోతలు లేని రాష్ట్రమే లక్ష్యంగా

ప్రస్తుతం గత విజయాలను పరిశీలించిన ప్రభుత్వం ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో భారీ ప్లాంట్లను ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇక మెగావాట్‌కు రూ.7 కోట్ల అంచనాతో రూ.28 వేల కోట్ల పెట్టుబడితో ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లాడానికి సిద్దం అయ్యింది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్ల సబ్సిడీ అందించనుంది. టెండర్లు పూర్తయిన ఏడాది నుంచి ఏడాదిన్నరలో ఈ ప్లాంట్లు అందుబాటులోకి తేవాలని సర్కార్ భావిస్తుంది..

అదేవిధంగా సబ్‌స్టేషన్ల వద్దే ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల డిస్కంలకు వేల కోట్ల రూపాయల కొనుగోలు ఖర్చులు తగ్గడమే కాకుండా... తెలంగాణకు, రైతులకు, పరిశ్రమలకు ఎలాంటి కోతలు లేని గ్రీన్ ఎనర్జీ అందుబాటులోకి రానుందని అధికారులు తెలియచేస్తున్నారు..

#Telangana BESS Project#Battery Energy Storage System#Telangana Green Energy#Solar Power Storage#TSGENCO Renewable Energy#Telangana Power Sector
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి