రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన మహిళా ఖైదీల వేధింపులు, అధికార దుర్వినియోగం కేసులో పరారీలో ఉన్న మాజీ జైలర్ దివ్య చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా ఖైదీలను జైలు నిబంధనలకు విరుద్ధంగా బయటకు తీసుకెళ్లి తన సొంతింట్లో పనులు చేయించుకున్న కేసులో గత రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న ఆమెను సైబర్ సెల్ సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒకప్పుడు జైలర్‌గా అధికారం చెలాయించిన అధికారిణే ఇప్పుడు అదే జైలులో ఖైదీగా ఊచలు లెక్కబెట్టాల్సి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2026 జూలై 12న అజ్మీర్ మహిళా జైలు ఇన్‌చార్జిగా పనిచేస్తున్న సమయంలో దివ్య చౌదరి, మహిళా గార్డు సోనియా చౌదరితో కలిసి తీవ్రమైన నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు మహిళా ఖైదీలను జైలు రికార్డుల్లో నమోదు చేయకుండా రహస్యంగా బయటకు తీసుకెళ్లారు.
అజ్మీర్‌లోని ఏఆర్‌జీ సిటీలో ఉన్న తన సొంత ఫ్లాట్‌కు ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్లి ఇల్లు శుభ్రం చేయించడం, ఇతర గృహ పనులు చేయించుకున్నట్లు విచారణలో నిర్ధారణ అయింది. ఈ అక్రమ రవాణాను ప్రశ్నించిన ప్రధాన ద్వారం భద్రతా సిబ్బందిని కూడా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ జరిపి దివ్య చౌదరితో పాటు సోనియాను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ అనంతరం విచారణకు హాజరుకాకుండా పరారైన వీరిపై ఆగస్టు 5న అజ్మీర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అజ్మీర్ ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాల్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం సైబర్ సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కోటాలోని ఒక ఫ్లాట్‌లో నక్కి ఉన్న దివ్యను గుర్తించి అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన మాజీ జైలర్‌ను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీనితో పోలీసులు ఆమెను అజ్మీర్ జైలుకే రిమాండ్ ఖైదీగా తరలించారు. జైళ్ల నిర్వహణలో అధికారులు సాగిస్తున్న తీవ్ర అధికార దుర్వినియోగానికి, నిబంధనల ఉల్లంఘనకు ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలిచింది.












