దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని తట్టంచవడి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగ్గా ఇప్పటికే కౌంటింగ్ పూర్తయి ఫలితాలు వెలుబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశోక్ ఆనంద్ ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఇ.వినాయగంపై ఏకంగా 8,482 ఓట్ల తేడాతో అశోక్ విజయం సాధించడం గమనార్హం. అధికార పార్టీ నేత విజయం సాధించడంతో కార్యకర్తలు, నేతలు సంబురాల్లో మునిగిపోయారు.
ఇదిలాఉండగా, తట్టంచవడి అసెంబ్లీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2026లో జరిగిన అసెంబ్లీ జనరల్ ఎన్నికల్లో రంగస్వామి రెండు స్థానాల నుండి బరిలో దిగారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆయన విజయం సాధించడంతో తట్టంచవడి స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా, అక్టోబర్ 6న ఆ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలోనూ అధికారపార్టీనే విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ఇదిలాఉండగా, తమిళనాడులోని రెండు అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని అధికార తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది.మదురాంతకం సెగ్మెంటులో TVK అభ్యర్థి కె. మరగాథం కుమారవేల్ ముందంజలో ఉన్నారు.ధారాపురం సెగ్మెంట్‌లోనూ TVK అభ్యర్థి పి.సత్యభామ.. డీఎంకే (DMK) అభ్యర్థిపై సుమారు 6,400 ఓట్ల పైచిలుకు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో అధికార బీజేపీ హవా కొనసాగుతోంది. ఉపఎన్నికల కౌంటింగ్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) భారీ మెజార్టీతో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థిని హాసిరాణి రాత్ లక్షకు పైగా ఓట్లతో భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.రెజినగర్ బీజేపీ అభ్యర్థి శంఖరవ్ సర్కార్ దాదాపు 34,000పైగా ఓట్ల తేడాతో సమీప టీఎంసీ అభ్యర్థి కంటే ముందంజలో ఉన్నారు.అస్సాం రాష్ట్రంలోని నాగావ్ లోక్‌సభకు జరిగిన ఉపఎన్నికలో అధికార బీజేపీ (BJP)అభ్యర్థి సమీప AIUDF పార్టీ అభ్యర్థిపై స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తున్నారు. సాయంత్రం వరకు పూర్తి ఫలితాలు వెల్లడికానున్నట్టు తెలుస్తోంది.












