ఇద్దరు వ్యక్తులు కొంతకాలం సహజీవనం చేశాక అనివార్య కారణాలతో ఒకరికొకరు దూరం కావడం, పెళ్లికి నిరాకరించారనే కారణంతో పురుషుడు లేదా మహిళ ఆత్మహత్యకు పాల్పడితే దానిని.. అది బలవన్మరణానికి ప్రేరెపించినట్టు కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేవలం పెళ్లికి నిరాకరిస్తే అవతలి వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పు వెల్లడించింది.
తెలంగాణకు చెందిన ఓ కేసులో మృతురాలి భాగస్వామి, అతని తల్లిదండ్రులు, సోదరి సహా ఆరుగురు నిందితులపై నమోదైన క్రిమినల్ కేసును తాజాగా సుప్రీంకోర్టు కొట్టేసింది. మృతురాలితో ఆమె భాగస్వామి కొంతకాలం సహజీవనం చేశాడని, ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు మహిళ.. ఆత్మహత్య చేసుకున్నట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ క్రమంలోనే వాదోపవాదాలు విన్న న్యాయస్థానం మృతురాలిని కావాలనే ఆత్మహత్యకు పురిగొల్పినట్టు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
లవ్ బ్రేకప్, పెళ్లికి నిరాకరించడం వంటి వ్యక్తిగత విషయాలు ఆత్మహత్యకు ప్రేరేపణ నేరం కిందకు రావని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ట్రయల్ కోర్టు, తెలంగాణ హైకోర్టు తీర్పులను పక్కనపెడుతూ ఆరుగురిపై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను దేశ సర్వోన్నత ధర్మాసనం కొట్టేసింది.
ఇదిలాఉండగా, ప్రేమ విఫలం, పెళ్లికి నిరాకరించడం అనేది ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని గౌహతి హైకోర్టు కూడా గతంలో తీర్పునిచ్చింది.ఒక వ్యక్తిని వేధింపులకు గురిచేసి, బలవంతపెట్టి లేదా కావాలనే ఆత్మహత్యకు పురికొల్పేలా ప్రవర్తిస్తే తప్పా..కేవలం వివాహ సంబంధాన్ని నిరాకరించినందుకు సెక్షన్ 306 వర్తించదని కోర్టు తేల్చి చెప్పింది.
లవ్, వివాహా సంబంధాల్లో వచ్చే భావోద్వేగ సమస్యలు లేదా విభేదాల కారణంగా భాగస్వామి ఆత్మహత్య చేసుకుంటే అవతలి వ్యక్తిని నేరుగా క్రిమినల్ నేరం కింద దోషిగా నిలబెట్టలేమని కలకత్తా హైకోర్టు స్పష్టంచేసింది. నిందితుడి ప్రవర్తన వల్లనే బాధితురాలికి ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదనే పరిస్థితి ఏర్పడితేనే ఆ చట్టం వర్తిస్తుందని తెలిపింది.












