ఖమ్మం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు.. పౌర సరఫరాల శాఖ అధికారి నరసింహారావు భారీగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో.. శుక్రవారం ఉదయం నుంచే ఏసీబీ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఏకకాలంలో ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, హైదరాబాద్ సహా మొత్తం ఏడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి.
మరోవైపు ఖమ్మంలో నరసింహారావుకు చెందిన రెండు విలాసవంతమైన భవనాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ఈ దాడులు జరుగుతుండగా, కీలక పత్రాలు, బంగారు ఆభరణాలు, భారీగా నగదు, బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. ఇక ఈ దాడులపై ఏసీబీ అధికారుల అధికారిక ప్రకటన చేయవలసి ఉంది. అప్పుడే పూర్తి వివరాలు బయటికి వచ్చే అవకాశాలున్నాయి..
అవినీతి మరకలు అంటించుకున్నది ఒక్క పౌర సరఫరాల శాఖ మాత్రమే కాదు... రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, మున్సిపల్, పోలీస్, వైద్య, విద్యా శాఖల వరకు ప్రతీ శాఖలోనూ లంచగొండులు తయారు అయ్యారనే విమర్శలున్నాయి.. ఈ క్రమంలో గడిచిన కొన్నేళ్లలోనే ఏసీబీ దాడుల్లో వందలాది మంది ఉన్నతాధికారులు, సిబ్బంది లంచం తీసుకుంటూ పట్టుబడటం తెలిసిందే.
ఇక ఇప్పటివరకు విజిలెన్స్, ఏసీబీ సోదాల్లో బయటపడ్డ అక్రమార్కుల ఆస్తుల విలువ లెక్కగడితే ఏకంగా వేల కోట్ల రూపాయలు దాటుతోందని కొన్ని కథనాలు తెలియచేస్తున్నాయి.. అలాగే ఏసీబీ దాడుల్లో కోట్ల విలువైన భూములు, కేజీల కొద్దీ బంగారం, విల్లాలు, పట్టుబడుతున్న విదేశీ కరెన్సీ చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు.. గతంలో అయితే ఏసీబీ పేరు వింటేనే ప్రభుత్వ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి.
అవినీతిలో పట్టుబడితే ఉద్యోగం ఊడుతుందనే భయం, సమాజంలో తలఎత్తుకోలేమనే బెరుకు ఉండేవి. కానీ, నేటి పరిస్థితులు దానికి పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి.. ఏసీబీ నిఘా తీవ్రమవుతున్నా, డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్నా... లంచగొండి అధికారుల్లో కొంచెం కూడా బెరుకు, భయం కలగడం లేదు. ఎంత తిన్నా దాచుకోవచ్చు, పట్టుబడితే కొన్ని రోజులు సస్పెన్షన్, ఆ తర్వాత లీగల్ లొసుగులతో మళ్లీ హాయిగా బయటకు రావచ్చు అనే ధీమా వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.
కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి సాగడం, కఠిన శిక్షలు త్వరగా పడకపోవడమే వారి పోకడలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.. ఇక సామాన్యుడు ఏదైనా పని విషయంలో ప్రభుత్వ ఆఫీసు మెట్లు ఎక్కాలంటే జేబులు ఖాళీ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దాడులు జరగడం, కోట్లు స్వాధీనం చేసుకోవడం వార్తల్లో నిలవడం సాధారణమైపోయింది కానీ, అవినీతి మూలాలను తుడిచిపెట్టే స్థాయిలో కఠినమైన చర్యలు ఉండటం లేదనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి..
మరోవైపు పట్టుబడిన అధికారుల ఆస్తులను తక్షణమే జప్తు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వెంటనే ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించి జైలుకు పంపినప్పుడే అధికారుల్లో నిజమైన భయం పుడుతుందని, వ్యవస్థను గొంగళి పురుగులా తొలిచేస్తున్న ఈ లంచగొండితనాన్ని అణచివేసేందుకు ఏసీబీ మరింత కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..












