ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ, మరోవైపు ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఉద్యాన శాఖ, ఆయిల్ ఫెడ్ అధికారులతో నిర్వహించిన భేటీలో రాష్ట్రంలో ఉద్యాన పంటల పథకాల అమలు, ఆయిల్ పామ్ సాగు పురోగతి తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు.
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుండటం సానుకూల పరిణామమని మంత్రి పేర్కొన్నారు. గతంతో పోలిస్తే స్పైసెస్ సాగు 65 శాతం, ఎర్రమిరప సాగు 83 శాతం, ఇతర సుగంధ ద్రవ్యాల సాగు 192 శాతం, పూల సాగు 198 శాతం పెరిగినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఉద్యాన పంటల సాగులో నమోదవుతున్న ఈ పురోగతిని కొనసాగించడంతో పాటు మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
నాణ్యమైన విత్తనాలు అందించాలి
రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని కూడా గణనీయంగా పెంచాలని మంత్రి సూచించారు.కూరగాయల సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని, ఉత్పత్తి పెంపుతో పాటు మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు. తెలంగాణలో పండించిన కూరగాయలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదగాలని, ఆ దిశగా ఉద్యాన శాఖ అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ఆయిల్ పామ్ సాగు పెంచాలి
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు అనుకూలత ఉందని, కనీసం 10 లక్షల ఎకరాల్లోనైనా సాగు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే లక్ష్యంతో అధికారులు, ఆయిల్ పామ్ కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఆయిల్ పామ్ గెలల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతుల్లో ఈ పంట సాగుపై ఆసక్తి, డిమాండ్ పెరిగే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతుల డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన మొక్కలను సరఫరా చేసేందుకు నర్సరీల్లో ముందుగానే మొక్కలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. మొక్కల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా, రైతులకు అవసరమైన సమయంలో మొక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కోకో సాగుకు ప్రోత్సాహం...
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ పామ్ తోటల్లో అంతరపంటగా కోకో సాగు చేస్తూ రైతులు మంచి ఆదాయం పొందుతున్నారని మంత్రి తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కోకో పంటకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతుల్లో సాగుపై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తొలిదశలో అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాల్లో కోకో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.












