SIR: ఎస్ఐఆర్ ప్రక్రియ విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నలు సంధించారు. సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని.. బీజేపీ, దాని మిత్రపక్షాలు మినహా అన్ని పార్టీలు రోడ్డెక్కాయని తెలిపారు. కానీ బీఆర్ఎస్ మాత్రం మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఓటరు జాబి ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు మహేశ్ కుమార్ గౌడ్. ఓట్ల తొలగింపు పేరుతో ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాస్తున్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు.
ఎస్ఐఆర్ ఆందోళనలో బీఆర్ఎస్ ఎక్కడుందని మహేశ్ కుమార్ గౌడ్ నిలదీశారు. సీఈసీ తప్పు చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు మాట్లాడటం లేదని.. నిరసన కార్యక్రమం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ-ఫార్ములా కేసులో అరెస్ట్ చేస్తారని భయమా? లేక కాళేశ్వరం కేసులో సీబీఐ అరెస్ట్ చేస్తుందని భయమా? అని మహేశ్ కుమార్ గౌడ్ అడిగారు. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో ఎస్ఐఆర్ వల్ల 90 లక్షల మందికి పైగా అర్హులైన ఓట్లు తొలగించే ముప్పు ఉందన్నారు మహేశ్ కుమార్ గౌడ్. అయినా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కాళేశ్వరం కేసులో లేదా ఫార్ములా ఈ కార్ రేసింగ్ స్కామ్ లో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతోనే కేసీఆర్, కేటీఆర్ నోరు విప్పడం లేదని విమర్శించారు.
సర్ ప్రక్రియ ద్వారా ముఖ్యంగా దళితుల, గిరిజనులు, మైనారిటీల ఓట్లను బీజేపీ తొలగిస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. వెస్ట్ బెంగాల్ లో రోహింగ్యాల పేరుతో మమతా బెనర్జీని, బిహార్‌లో ఆర్జేడీ గెలవకుండా ఎలాంటి కుట్రలు చేసిందో ఇప్పుడు తెలంగాణ, పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుని అదే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోందన్నారు.
సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించే వరకు తమ నిరసన ర్యాలీలు ఆగవని మహేశ్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. గతంలో ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటును కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు.












