తెలంగాణ

BRS: ఆర్టీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మౌనం.. అసలు ప్లాన్ ఇదేనా?

రచన: Mahesh••7 నిమిషాల పఠనం

తెలంగాణ ఆర్టీసీలో చాలా కాలం తర్వాత జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. వివిధ కార్మిక సంఘాలు హోరాహోరీగా తలపడుతుండగా.. అధికార కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న సంఘాలకు కొన్ని యూనియన్లు మద్దతు ప్రకటించాయి. గతంలో ప్రత్యర్థులుగా తలపడిన సంఘాలు ఇప్పుడు ఒక్కటవడంతో ఎన్నికల సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

BRS : తెలంగాణ ఆర్టీసీలో చాలా కాలం తర్వాత జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి. వివిధ కార్మిక సంఘాలు హోరాహోరీగా తలపడుతుండగా.. అధికార కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న సంఘాలకు కొన్ని యూనియన్లు మద్దతు ప్రకటించాయి. గతంలో ప్రత్యర్థులుగా తలపడిన సంఘాలు ఇప్పుడు ఒక్కటవడంతో ఎన్నికల సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికలకు దూరంగా ఉండటానికి కారణం అదేనా?

బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆ పార్టీ అనుబంధ కార్మిక విభాగం చురుగ్గా వ్యవహరించేది. మాజీ మంత్రి హరీశ్‌రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఆర్టీసీ కార్మికుల వ్యవహారాలను పార్టీ సీరియస్‌గా తీసుకునేది. అలాంటి పార్టీ ఈసారి మాత్రం ఎన్నికల బరిలోకి రాకపోవడం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుత పరిస్థితికి కారణమవుతున్నాయన్నది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన వాదన. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా అప్పట్లో కార్మిక సంఘాలను రద్దు చేశారు. యూనియన్ల అవసరం లేదనే విధానంతో గుర్తింపు సంఘం ఎన్నికలకు కూడా తెరపడింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు రావడంతో.. ఇప్పుడు అదే అంశం గులాబీ నాయకులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని పార్టీ పెద్దలు భావించినట్టు సమాచారం.

పోటీ చేస్తే మొదటికే మోసం?

ఈసారి ఎలాగైనా బరిలోకి దిగాలని బీఆర్ఎస్ అనుబంధ కార్మిక విభాగానికి చెందిన కొందరు నేతలు పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్టు ప్రచారం జరిగింది. అయితే గతంలో యూనియన్ల అవసరం లేదని స్వయంగా పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పెద్దలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఆర్టీసీ పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం కాలేదనే అంశం కూడా ఈ వ్యవహారంలో మరో సున్నితమైన పాయింట్‌గా మారిందని చెబుతున్నారు. దీంతో ప్రత్యక్షంగా ఎన్నికల్లోకి దిగడం కంటే.. ప్రస్తుతానికి దూరంగా ఉండటమే మంచిదన్న నిర్ణయానికి పార్టీ వచ్చినట్టు తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బయటకు సైలెంట్.. లోపల మాత్రం వేరే కథ?

ఇక్కడే అసలు ఆసక్తికరమైన చర్చ మొదలైంది. బీఆర్ఎస్ అధికారికంగా ఏ కార్మిక సంఘానికీ మద్దతు ప్రకటించకపోయినా.. ఆ పార్టీకి అనుకూలంగా ఉండే ఆర్టీసీ కార్మిక ఓటర్లతో అనుబంధ కార్మిక విభాగం నేతలు అంతర్గతంగా మాట్లాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ అనుబంధ సంఘానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కొందరు బీఆర్ఎస్ సానుభూతిపరులకు సూచిస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయంపై పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. బహిరంగంగా తటస్థంగా కనిపిస్తూనే.. తమకు అనుకూలమైన ఓటర్లను తమ రాజకీయ లైన్‌కు అనుగుణంగా ప్రభావితం చేయాలన్న వ్యూహం ఉందా? అన్న ప్రశ్నలు మాత్రం వినిపిస్తున్నాయి.

రేపటి కోసం ఇప్పటి నుంచే లెక్కలేనా?

ప్రస్తుతం ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని బీఆర్ఎస్ కార్మిక విభాగం నేతలు చెబుతున్నట్టు సమాచారం. అంటే ఈ ఎన్నికలను పూర్తిగా వదిలేసినట్టా? లేక రాజకీయ పరిస్థితులను గమనిస్తూ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఒకప్పుడు ఆర్టీసీ యూనియన్ల వ్యవహారంలో కీలకంగా ఉన్న బీఆర్ఎస్.. ఇప్పుడు అదే ఎన్నికల నుంచి బయట ఉండటం వెనుక కారణాలపై కార్మిక వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా అధికారికంగా ఎలాంటి సపోర్ట్ ప్రకటించకుండా.. తమ సానుభూతిపరుల ద్వారా ప్రభావం చూపించే ప్రయత్నం జరుగుతోందన్న ప్రచారం నిజమైతే, ఈ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉందో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.

#BRS#Telangana RTC Elections#TSRTC Union Elections#Telangana Politics#KCR#Harish Rao#RTC Workers#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి