రాజకీయ సవాళ్లు, ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొడుతూ తమిళనాడులో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ సంచలన విజయాలు సాధించింది. గతంలో ఎదురైన ఇబ్బందులన్నింటినీ దాటుకుంటూ టీవీకే అభ్యర్థులు ఘనవిజయం సాధించడంతో పార్టీ వర్గాల్లో ఉత్సాహం కనిపిస్తుంది. ఇక ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి పి. సత్యభామ భారీ ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేశారు.
ఆమె ఏఐఏడీఎంకే అభ్యర్థి కె. భానుమతిపై ఏకంగా 9,838 ఓట్ల భారీ మెజార్టీతో ఈ విజయాన్ని అందుకున్నారు. అటు మధురాంతకం నియోజకవర్గంలోనూ టీవీకే అభ్యర్థి కె. మరకతం కుమారవేల్ సైతం గెలుపును కైవసం చేసుకున్నారు.. DMK అభ్యర్థి పరంతమెన్‌పై మరకతం కుమారవేల్ విజయం సాధించి టీవీకే బలాన్ని చాటారు. గతంలో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలుగా ఉన్న మరకతం కుమారవేల్, సత్యభామ... ఆ పార్టీని వీడి TVKలో చేరారు.
విజయ్ ప్రభుత్వం ఎదుర్కొన్న బలపరీక్షలో మద్దతు ఇవ్వడంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.. ఇక ఈ విజయాలపై తమిళనాడు మంత్రి కేఏ సెంగోట్టియన్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ పారదర్శక పాలనకు ప్రజలు ఇచ్చిన తిరుగులేని ఆమోదమే ఈ ఉప ఎన్నికల ఫలితాలని పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ఆధిక్యాన్ని చాటుకుంది.
ఇక మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని భబానీపూర్‌లో ఓడించిన ముఖ్యమంత్రి సువేందు అధికారి నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ నేపథ్యంలో నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌పై హసిరాణి రథ్ 31,943 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రచార సమయంలో తన కుమారుడు చంద్రనాథ్ రథ్ హత్యకు గురైన తీవ్ర విషాదాన్ని తట్టుకుని హసిరాణి రథ్ ఈ సంచలన విజయాన్ని నమోదు చేయడం గమనార్హం.
మరోవైపు రెజినగర్ అసెంబ్లీ స్థానంలోనూ బీజేపీ జెండా ఎగిరింది. బీజేపీ అభ్యర్థి శంఖరావు సర్కార్ ఘన విజయం సాధించారు. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (JAUP) అధినేత హుమాయున్ కబీర్ కుమారుడు గోలం నబీ ఆజాద్‌ను శంఖరావు సర్కార్ ఓడించి ఈ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే అస్సాంలోని నాగావ్ లోక్‌సభ నియోజకవర్గంలోనూ కమలం వికసించింది. బీజేపీ అభ్యర్థి, మాజీ డిప్యూటీ కమిషనర్ దేవాశిష్ శర్మ ఘన విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థి సిబామోని బోరా, ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్‌లను వెనక్కి నెట్టి దేవాశిష్ శర్మ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఇక కాంగ్రెస్ కు బై చెప్పి బీజేపీలో చేరిన ప్రద్యుత్ బోర్డోలోయ్ డిస్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది..
అటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఉపఎన్నికలో NDA మిత్రపక్షమైన ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయదుందుభి మోగించింది. సీఎం రంగస్వామి కంచుకోటైన తట్టంచావడి స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ ఆనంద్ 8 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తానికి ఈ ఉప ఎన్నికల ఫలితాలు తమిళనాడులో టీవీకేలో జోష్ నింపగా.. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో అధికార, ప్రతిపక్ష పార్టీల సమీకరణాలలో కీలక మార్పులకు శ్రీకారం చూట్టాయి..












