తెలంగాణ

Congress: రైతుల‌పై కేసులు.. రేవంత్ సర్కార్‌కి మూడినట్టేనా?

రచన: Venu•••6 నిమిషాల పఠనం

ఎన్నికల ప్రచారంలో అన్నదాత సంక్షేమమే మా లక్ష్యం.. రైతే రాజు.. వారే మా ప్రాణం అంటూ ఊకదంపుడు మాటలతో ఎన్నో హామీలు ఇచ్చే పార్టీలు అధికారం దక్కగానే ఆ అన్నదాతల పై ఉక్కుపాదం మోపుతున్నాయి..

ఎన్నికల ప్రచారంలో అన్నదాత సంక్షేమమే మా లక్ష్యం.. రైతే రాజు.. వారే మా ప్రాణం అంటూ ఊకదంపుడు మాటలతో ఎన్నో హామీలు ఇచ్చే పార్టీలు అధికారం దక్కగానే ఆ అన్నదాతల పై ఉక్కుపాదం మోపుతున్నాయి.. కొండంత హామీలు ఎన్నికల మేనిఫెస్టోల్లో గుప్పించి, పీఠమెక్కాక వాటిని అటకెక్కిస్తున్నాయి. రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగినా, సాగునీరు-ఉచిత విద్యుత్ కావాలని నిరసించినా, భూములు లాక్కోవద్దని ప్రశ్నించినా.. చివరకు వారికి దక్కేది కాళ్లకు-చేతులకు సంకెళ్లు, పోలీసు స్టేషన్లలో కేసులు!.. ఇది నేటి రాజకీయాల ముఖ చిత్రం..

మరోవైపు ప్రజాపాలన అని చెప్పి పీఠమెక్కిన కాంగ్రెస్ సర్కార్ హయాంలో.. తమ సమస్యలపై గళమెత్తిన రైతన్నలపై కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి.. కాగా వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ వివాదం మొదలుకొని, సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రోడ్డెక్కిన రైతుల వరకు.. కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే పోలీసు బలగాలను ప్రయోగిస్తోందనే టాక్ వినిపిస్తుంది.

చివరకు ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న రైతు చేతులకు సైతం బేడీలు వేసిన దృశ్యాలు కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ధోరణికి అద్దం పడుతున్నాయని, ఏ రైతులైతే కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసి అధికారంలో కూర్చోబెట్టారో, అదే రైతన్నలకు సంకెళ్లు వేస్తుండటంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద గండం పొంచి ఉందనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఇది ఒక్క కాంగ్రెస్ కథే కాదు! గతంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ హయాంలోనూ అన్నదాతలు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు.. ఖమ్మం మార్కెట్ యార్డ్‌లో మిర్చికి మద్దతు ధర అడిగిన పాపానికి నాటి కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా రైతుల చేతులకు సంకెళ్లు వేసి, జైలు గోడల వెనుకకు నెట్టింది. అదేవిధంగా రైతుబంధు అని ఊదరగొడుతూనే, ప్రాజెక్టుల రీడిజైన్, భూసేకరణ పేరిట నిరసించిన అన్నదాతలపై అక్రమ కేసులు బనాయించింది.

రైతును రాజును చేస్తాం అన్న నినాదం కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమైందనడానికి నాటి BRS పాలన కూడా ఒక నిదర్శనంగా చెప్పుకొంటున్నారు. మరోవైపు గత చరిత్ర తిరగేస్తే.. టీడీపీ హయాంలోనూ రైతన్నకు తీవ్రమైన ద్రోహమే జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బషీర్‌బాగ్ లో పోరాడిన రైతులపై ఏకంగా కాల్పులు జరిపించి, అన్నదాతల రక్తాన్ని చిందించిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి విడతల పేరిట అర్ధాంతరంగా మభ్యపెట్టడం, గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతులపై పోలీసులతో అణచివేత చర్యలు చేపట్టడం ద్వారా టీడీపీ కూడా అన్నదాతల ఆగ్రహానికి గురై అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి వివాదాలు తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతిరాష్ట్రంలోనూ పాలకుల వైఖరి ఇలాగే ఉందని పలు సంఘటనలు నిరూపిస్తున్నాయి..

ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు తమ హక్కుల కోసం ఏడాదికి పైగా ఆందోళనలు చేస్తే.. వారిపై వేలాది అక్రమ కేసులు పెట్టడం, ఉగ్రవాదుల ముద్ర వేయడం దేశమంతా చూసింది. పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా.. రైతులకు దక్కేది మాత్రం దగా, ద్రోహమే అని అధికార పార్టీలు నిరూపించడం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని అంటున్నారు. మరోవైపు రైతు కంట కన్నీరు తెప్పించిన ప్రభుత్వాలు కాలక్రమంలో ఓడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి..

అన్నదాత ఆగ్రహజ్వాలల్లో అధికార పీఠం బూడిదవడం ఖాయం అనే సంకేతాలు ఇచ్చాయి. ప్రజా క్షేమాన్ని మరచిన ప్రభుత్వాలు కొంత కాలం జనాన్ని మభ్య పెట్టవచ్చు కానీ ఎల్లకాలం వాళ్ళ ఆటలు సాగవని జనం కసిరించుకుని మూలకు కూర్చోబెట్టిన పార్టీలను చూస్తే అర్థం అవుతుందని లోకం గుర్తు చేస్తుంది. పాలన బాగుంటే ప్రజలే ఎన్నుకుంటారు.. కానీ పదవుల కోసం దిగజారడం నేటి పార్టీలకు ఫ్యాషన్ గా మారిందనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నాయి..

#Telangana Politics#Revanth Reddy#Farmer Rights#Farmer Protests#Political Promises#Lagacharla Incident#Telangana News#BRS#Congress#TDP
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి