జంతర్ మంతర్ వద్ద సీజేపీ భారీ నిరసనకు పిలుపు
నగర వ్యాప్తంగా హై అలర్ట్
నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలు
రైల్వే రవాణాపై తీవ్ర ప్రభావం
గోరఖ్‌ధామ్, లక్నో మెయిల్ రద్దు.. ప్రధాన స్టేషన్లలో కఠిన ఆంక్షలు
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు అక్టోబర్ 10న పిలుపునిచ్చింది. గతంలో నీట్ అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను కోరుతూ సీజేపీ చేపట్టిన ఆందోళనల్లో హింస చెలరేగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఈసారి కేంద్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
ఈ క్రమంలో నగర వ్యాప్తంగా దాదాపు 40 వేల మంది పోలీసు బలగాలను రంగంలోకి దించి భద్రతను కట్టుదిట్టం చేశారు.. అలాగే రాజధానిలో హోటళ్లు, లాడ్జీలు, షెల్టర్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి నిరాకరించిన పోలీసులు, ఆ పరిసర ప్రాంతాల్లో 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరోవైపు పుకార్లు, తప్పుడు సమాచారం వ్యాపించకుండా వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
జనపథ్-కర్తవ్యపథ్ క్రాసింగ్ పరిసరాల్లోని 4 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో అక్టోబర్ 9 రాత్రి 10 గంటల నుండి అక్టోబర్ 10 రాత్రి 10 గంటల వరకు వరుసగా 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.. అదేవిధంగా న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లలో మధ్యాహ్నం 2 గంటల వరకు కఠిన ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్, లక్నో మెయిల్, ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ వంటి పలు కీలక మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు.
రాత్రి 9 గంటల నుంచే 57 మెట్రో స్టేషన్లను మూసివేయాలని పోలీసులు ప్రతిపాదించగా, దీనిపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. నిరసనల కారణంతో మెట్రో రాకపోకలపై పూర్తి నిషేధం విధించరాదని స్పష్టం చేసింది. భద్రతా ఆంక్షలపై అభ్యంతరాలు ఉంటే పిటిషన్ దాఖలు చేయవచ్చని తెలిపింది. ఇక తాజా పరిస్థితి తీవ్రతను దృష్ట్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు.
తన ముందస్తు పర్యటనలన్నీ రద్దు చేసుకుని ఢిల్లీలోనే విడిది చేసిన ఆయన, ఉన్నతాధికారులతో భద్రతా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వీవీఐపీ ప్రాంతాల్లో భద్రతా దళాలు కఠిన నిఘా ఏర్పాటు చేశాయి. అలాగే గత ఆందోళనల అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న అధికారులు ముందస్తు భద్రతా చర్యలో భాగంగా నగరాన్ని పూర్తిస్థాయి నియంత్రణలోకి తెచ్చాయి. ఇక ఎన్నికల కమిషన్‌పై సీజేపీ లేవనెత్తిన ఈ నిరసన సెగ రాజధానిలో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది...












