Donald Trump: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నోబెల్ శాంతి బహుమతి 2026’ మిస్ కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా శాంతిని నెలకొల్పేందుకు తానే అసలైన అర్హుడినని భావిస్తున్న ఆయనకు ఈ అవార్డు దక్కకపోవడం ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి వరించడంపై ఆయన పరోక్షంగా తన అసహనాన్ని బయటపెట్టారు.
ట్రూత్ సోషల్‌లో రీపోస్ట్..
నోబెల్ శాంతి పురస్కారానికి తాను పూర్తి అర్హుడినని, అయితే రాజకీయ కారణాల వల్ల ఆ కమిటీ తనకు అవార్డు ఇవ్వకపోవచ్చని ట్రంప్ గతంలోనే కామెంట్స్ చేశారు. ఊహించినట్లే ఈసారి అవార్డు నవనీతం పిళ్లైకి దక్కడంతో, ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఓ సంచలన పోస్టును రీపోస్ట్ చేసి తన నిరసనను వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ సీనియర్ అటార్నీ డేవిడ్ షొయెన్ పెట్టిన పోస్ట్‌ను ఆయన షేర్ చేయడంతో వివాదం మరింత రాజుకుంది.
"ఆమె శాంతి దూత కాదు.. అమెరికా ద్వేషి!"
డేవిడ్ షొయెన్ ఆ పోస్టులో నోబెల్ ఎంపిక కమిటీ నిర్ణయాన్ని నేరుగా తప్పుపట్టారు. "నవనీతం పిళ్లై అమెరికా, ఇజ్రాయెల్‌లను బహిరంగంగా ద్వేషించే వ్యక్తి. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి ఆమె ఏనాడూ చిత్తశుద్ధితో కృషి చేయలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇరాన్ దూకుడును అడ్డుకుంటూనే, గాజా పునర్నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నారు. చరిత్రలో ఎవరూ ఊహించని అబ్రహం ఒప్పందాలను తీసుకొచ్చి వాటిని విస్తరిస్తున్నారు. నిజమైన శాంతి స్థాపన కోసం పాటుపడుతున్న ఇలాంటి కీలక అంశాలను నోబెల్ కమిటీ గుర్తించి ఉండాల్సింది" అంటూ పెట్టిన పోస్ట్‌ను ట్రంప్ రీపోస్ట్ చేయడం ద్వారా తన పూర్తి మద్దతు తెలిపారు.
శాంతి పురస్కారాల ఎంపికలో అంతర్జాతీయ రాజకీయాలు, పక్షపాతం స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ట్రంప్ వర్గం గళమెత్తుతుండటంతో నోబెల్ శాంతి బహుమతి వ్యవహారం మరోసారి అంతర్జాతీయ దౌత్య వేదికలపై చర్చనీయాంశంగా మారింది.












