Yash-Toxic: ప్రస్తుతం మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలలో టాక్సిక్ మూవీకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అంతేకాదు, ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారూ ఉన్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి రాకింగ్ స్టార్‌గా యష్ ఏ రేంజ్‌లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న కన్నడ అగ్ర హీరోలలో యష్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు.
యష్ డ్యూయల్ రోల్ లో నటించిన లేటెస్ట్ సినిమా టాక్సిక్. ఈ సినిమాకి తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఇందులో ఎక్కువగా మాఫీయా బ్యాగ్‌డ్రాప్, హెవీ యాక్షన్ సీన్స్, ఘాటైన రొమాన్స్ తదితర అంశాలున్నాయి. అందుకే, 'A' సర్టిఫికెట్‌తో ఈ సినిమా రాబోతోంది.
ఇక, సెన్సార్ పూర్తైన ఈ సినిమా రన్‌టైమ్ కూడా లాకైంది. 3 గంటల 14 నిమిషాల భారీ రన్‌టైమ్ తో టాక్సిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కాబోతోంది. ఈ మధ్య కాలంలో దాదాపు పాన్ ఇండియన్ సినిమాలన్నీ కనీసం 3 గంటల రన్‌టైమ్ తో వస్తున్నాయి. ఇంతసేపు నిడివి ఉన్నా కూడా కంటెంట్‌లో దమ్ముంటే, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. భారీ యాక్షన్ సీన్స్, విజువల్ ట్రీట్ మీదే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు.
కాగా, టాక్సిక్ సినిమా అందరికీ ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా గీతూ మోహన్ దాస్ తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకునే సినిమా ఇది. అలాగే, యష్ కెరీర్‌లో మరో మైల్ స్టోన్ మూవీ కూడా. వీరికే కాదు, హీరోయిన్‌గా నటించిన కియారా అద్వానీకి..కీలక పాత్రల్లో నటించిన నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లకి కూడా ఈ మూవీ ఎంతో ప్రత్యేకం. అంతేకాదు, ఈ సినిమా ఐమాక్స్ వెర్షన్‌లోనూ రాబోతోంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా కేవలం పెద్ద వాళ్ళకి మాత్రమే పరిమితం అన్నది ఒక్కటే కాస్త మైనస్ అని చెప్పాలి. కాగా, ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.


