22A Lands: 22ఏ భూముల అంశంలో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూముల గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో 22ఏ భూములపై సీఎం రేవంత్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కొనుగోలు చేసిన భూమి ఎక్కడికీ పోదన్నారు. అందుకు నాదీ భరోసా అని చెప్పారు. 22ఏ విషయంలో మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత మాది అని రేవంత్ తేల్చి చెప్పారు. అధికారులతో మాట్లాడి రిజిస్ట్రేషన్లకు ఆదేశాలు ఇస్తానన్నారు.
''22ఏ విషయంలో మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత మాది. ఈ విషయంలో మీకు ఆందోళన అవసరం లేదు. సోషల్ మీడియాలో కొందరు చేసే అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు'' అని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కూకట్ పల్లిలో ఇందిరమ్మ టవర్స్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఆనాడు తాను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే కూకట్ పల్లి ప్రజలు తనను ఆశీర్వదించి గల్లీ నుంచి ఢిల్లీకి పంపారని రేవంత్ గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో మీరు ఆశించిన మేరకు అభివృద్ధి చేయలేకపోయానని అన్నారు. కానీ ఇప్పుడు కూకట్ పల్లిని అభివృద్ధి చేసుకునేందుకు అన్ని రకాల అధికారం ఉందన్నారు. మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా అడిగి చేయించుకోండని చెప్పారు. కూకట్ పల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయాలని శ్రీధర్ బాబుని ఆదేశించారు సీఎం రేవంత్. పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలన రెండేళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు.
సన్నబియ్యం, ఉచిత విద్యుత్..
''రాష్ట్రంలో 3 కోట్ల 28 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఇందిరమ్మ చీరలను సారెగా అందించాం. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. స్వయం సహాయక సంఘాలకు రూ.65వేల కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాం. కడుపులో విషం పెట్టుకుని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రభుత్వంపైకి ఉసిగొల్పినా వెనక్కి తగ్గలేదు. ఆడబిడ్డలను బస్సులకు యజమానులను చేశాం. పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాం. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో స్టాళ్లను ఇచ్చాం.
మీ సొంతింటి కలను నిజం చేస్తా..
ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లించుకుంటూనే.. మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న వాళ్లు మీలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా? పట్టణంలో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కు శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో లక్ష ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ సొంతింటి కలను నిజం చేసేందుకు మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా.
కరవు రావాలని క్షుద్ర పూజలా..!
పదేళ్ల బీఆర్ఎస్ పాలనను.. రెండేళ్ల మీ తమ్ముడి పాలనను బేరీజు వేసుకోండి. నాకు వయసు ఉంది… ఓపిక ఉంది.. మీకు మంచి చేయాలన్న సంకల్పం ఉంది. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళుతున్నాం. కొంతమంది దుర్మార్గులు రాష్ట్రంలో కరవు రావాలని క్షుద్ర పూజలు చేశారు. అయినా దేవుడు మన వైపు ఉన్నాడు. వర్షాలు కురిపించాడు. మంచి మనసుతో అభివృద్ధి చేయాలన్న మా సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం ఉంది. కుటిల బుద్ధితో క్షుద్ర పూజలు చేసే వారికి అది తిరిగి వారినే అష్టదిగ్బంధనం చేస్తుంది. మీరు అండగా ఉండండి.. అభివృద్ధి చేసి చూపిస్తా'' అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.


