AYUSH: తెలంగాణలో AYUSH హౌస్ సర్జన్లు, ఇంటర్న్ లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యుల స్టైపెండ్ పెంపు కోసం తెలంగాణ AYUSH HS & PG Joint Action Committee (AYUSH-JAC) ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ AYUSH వైద్య విద్యా సంస్థలకు చెందిన వెయ్యి మందికిపైగా విద్యార్థులు, ఇంటర్న్ లు, హౌస్ సర్జన్లు, PG వైద్యులు ఈ మహా ధర్నాలో పాల్గొని తమ నిరసనను బలంగా వ్యక్తం చేశారు. దాదాపు పదేళ్లుగా స్టైపెండ్ పెంచకపోవడం, AYUSH వైద్య విద్యార్థుల పట్ల కొనసాగుతున్న అసమానత, వివక్షకు నిరసనగా ఈ ధర్నా నిర్వహించారు.
రాష్ట్రంలోని డా.బీ.ఆర్.కె.ఆర్. ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల & ఆసుపత్రి, ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల/ఆసుపత్రి, JSPS ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల & ఆసుపత్రి, ప్రభుత్వ నిజామియా టిబ్బీ యునాని వైద్య కళాశాల & ఆసుపత్రి, ప్రభుత్వ నేచర్ క్యూర్ ఆసుపత్రిలకు చెందిన విద్యార్థులు, ఇంటర్న్ లు, హౌస్ సర్జన్లు, PG వైద్యులు భారీగా ధర్నాలో పాల్గొన్నారు.
వివిధ వర్గాల నుంచి మద్దతు..
ఈ మహా ధర్నాకు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, AYUSH సంఘాల ప్రతినిధులు, వైద్య రంగ ప్రముఖులు హాజరయ్యారు. AYUSH వైద్యుల న్యాయమైన పోరాటానికి మద్దతు తెలిపారు. ABVP నేషనల్ సెక్రటరీ శ్రవణ్ బిరాజ్, ABVP తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ రాజు, హైదరాబాద్ సిటీ సెక్రటరీ రాజు, స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్యామ్, మహేష్ తదితరులు ధర్నాలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. AYUSH వైద్యుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాజకీయ, ప్రజా ప్రతినిధులుగా CPI MLC సత్యం, MLC తీన్‌మార్ మల్లన్న, MLC అంజిరెడ్డి, MLA రాకేష్ రెడ్డి, అలాగే కంటెస్టెడ్ MLC రాకేష్ రెడ్డి తదితరులు తమ మద్దతు ప్రకటించారు.
“ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం”..
ప్రభుత్వం పది రోజులుగా తమ సమస్యను పట్టించుకోకపోవడంపై AYUSH-JAC అధ్యక్షుడు డాక్టర్ బి.రాజేష్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. “న్యాయం జరిగే వరకు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం. మా పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించం. ఇది కేవలం స్టైపెండ్ కోసం చేస్తున్న పోరాటం కాదు. AYUSH వైద్య విద్యార్థుల సమానత్వం, గౌరవం, భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం” అని రాజేశ్ స్పష్టం చేశారు.
రాజకీయ పార్టీలకు JAC విజ్ఞప్తి..
AYUSH వైద్యులకు వెంటనే న్యాయం చేయాలని ధర్నాలో పాల్గొన్న పలువురు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, AYUSH సంస్థలు కలిసి ఉద్యమానికి మరింత మద్దతు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. అవసరమైతే ఈ పోరాటాన్ని తెలంగాణను దాటి జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కూడా మద్దతిస్తామన్నారు.
“హామీలు కాదు..వెంటనే GO కావాలి”
AYUSH హౌస్ సర్జన్లు, PG వైద్యులు తమ ప్రధాన డిమాండ్‌పై స్పష్టత ఇచ్చారు. గతంలో ఎన్నోసార్లు వినతులు, సమావేశాలు, విజ్ఞప్తులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇకపై కేవలం హామీలతో ఉద్యమాన్ని విరమించేది లేదని తేల్చి చెప్పారు. AYUSH స్టైపెండ్ పెంపునకు సంబంధించి తక్షణమే అధికారిక GO విడుదల చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. “పదేళ్ల నిరీక్షణకు ఇక ముగింపు పలకాలి. మాకు మరో హామీ అవసరం లేదు. న్యాయం చేసే GO కావాలి” అని విద్యార్థులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని AYUSH-JAC హెచ్చరించింది.
11వ రోజుకు ఉద్యమం..
నిరవధిక సమ్మె ఇప్పటికే 10వ రోజుకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం రాకపోవడంతో, ఆగస్టు 14న 11వ రోజు కూడా AYUSH విద్యార్థులు, హౌస్ సర్జన్లు, PG వైద్యుల నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. “న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు, AYUSHకు సమానత్వం వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుంది'' అని జేఏసీ తెలిపింది.


