Cm Revanth: SIR పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు తొలగించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. 'బెంగాల్ లో గెలిచామని ఇక తెలంగాణనే టార్గెట్ అని కొందరు మాట్లాడుతున్నారు. బెంగాల్ లో మమతా బెనర్జీ వదిలేశారేమో.. ఇక్కడ మా కాంగ్రెస్ కార్యకర్తలు వదిలిపెట్టరని నేను చెప్పా. గల్లీ గల్లీ తిరగండి, ఇంటింటికీ వెళ్లండి.. ప్రతి ఒక్కరి ఓటును చెక్ చేయండి. ఏ ఒక్క అర్హుడు ఓటు హక్కును కోల్పోకుండా చూడండి. ప్రతీ ఒక్కరూ ఒక రేవంత్ రెడ్డిగా మారి ఓటు హక్కును కాపాడాలి'' అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో “మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హిందూ ముస్లింలు కాంగ్రెస్ కు రెండు కళ్లు అని మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు సోనియా గాంధీ అని రేవంత్ చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని అమిత్ షా అన్నారు.. తెలంగాణలో కాదు ముందు గుజరాత్ లో తొలగించి చూపించాలని ఆనాడు మేం సవాల్ విసిరాము అని రేవంత్ తెలిపారు.
మైనారిటీలకు సముచిత స్థానం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్ పటిష్టంగా అమలు చేసిందని రేవంత్ చెప్పారు. మైనారిటీ యువత గ్రూప్ 1, గ్రూప్ 2 లలో ఉద్యోగాలు సాధించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీలకు సముచిత స్థానం కల్పించామన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మైనారిటీ నుంచి సభ్యుడిగా నియమించామని తెలిపారు. కొందరు గ్రూప్స్ ఉద్యోగాలపై కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూసినా.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామన్నారు. ఎవరూ అడగకపోయినా మైనారిటీలకు దక్కాల్సిన స్థానాన్ని వారికి కల్పించామన్నారు.
మంత్రి పదవి, గ్రూప్ 1 ఉద్యోగం, 3 కోట్ల నగదు..
అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చాం, నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం కల్పించడంతో పాటు రూ.3 కోట్లు నగదు బహుమతి అందించాం. మహమ్మద్ సిరాజుద్దీన్ కోసం నిబంధనలు సవరించి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. నాకు హిందూ ముస్లింలు ఇద్దరూ సమానమే, హిందూ ముస్లింలు నాకు రెండు కళ్లు అని రేవంత్ చెప్పారు. మైనారిటీ యువత చదువుతో పాటు నైపుణ్యం సంపాదించాలన్నారు.
జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. నైపుణ్యం పెంచుకుంటే అది మీ జీవితాలను మారుస్తుందన్నారు. మీ అందరి సహకారంతోనే నేను తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని రేవంత్ అన్నారు.
“మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్” కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మైనార్టీ యువతను, మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి ఐఐటీ, నీట్‌తో పాటు ఇతర పోటీ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు.


